‘జాంబీ రెడ్డి’ రివ్యూ

మొదట చిత్రం ‘అ!’తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు, విజ‌యాన్ని అందుకున్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ. రెండో చిత్రం ‘క‌ల్కి’ అనుకున్న మేర విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది. ఇప్పుడు ఈ యువ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన  మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ . ఈ సినిమాని క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ సినిమాను తెర‌కెక్కించటం, జాంబీ జానర్ లో మూవీ చేయటంతో హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు ఈ చిత్రం టైటిల్ కూడా గమ్మత్తుగా ఉండి.. సమరసింహా రెడ్డి, ఇంద్రసేనారెడ్డి లాగ జాంబి రెడ్డి అని పెట్టారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉందని అన్నారు. జాంబీలు ఉన్నా ఇదో కామెడీ సినిమా అని చెప్పారు. ఈ సినిమాపై జనాల దృష్టి పడటానికి ఈ మాత్రం చాలు. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం కథేంటి, టైటిల్ ఇంత వైవిధ్యంగా ఉండటానికి కారణం ఏమిటి..చూసి నవ్వుకునే కామెడీ సినిమానా లేక జాంబీలతో దర్శకుడు భయపెట్టాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Prashanth Varma new film Zombie reddy review jsp

కథేంటి...
కరోనా లాక్ డౌన్ ప్రకటనతో సినిమా మొదలవుతుంది. ఈ కరోనా కు వాక్సిన్ రెడీ చేయాలని ఓ అత్యుత్సాహి ప్రయోగం చేస్తూంటాడు. మరో ప్రక్క కరోనా ని లెక్కచేయని బ్యాచ్ (తేజు సజ్జ, దక్షా నాగర్కర్, కిరీటి, ఆర్జే హేమంత్ ). క్లోజ్ ప్రెండ్స్ అయిన వీళ్లు గేమింగ్ డిజైనర్స్ . వీళ్ళలో ఒకరి (ఆర్జే హేమంత్) పెళ్లి కర్నూలులో జరగబోతోంది. దాంతో ఆ లాక్ డౌన్ టైం అయినా ఈ బ్యాచ్ ఆ పెళ్ళికి వెళతారు. సరిగ్గా వీళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఓ ట్విస్ట్. మొదట చెప్పుకున్న కరోనా వాక్సిన్ చేసిన ఆ క్యాండిడేట్ ది కర్నూలే. అతను చేసిన వాక్సిన్ సక్సెస్ కాకపోగా వికటిస్తుంది. దాంతో  ఆ ఊరిలో ఆ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు జాంబీలుగా మారిపోయి ఉంటారు. ఇంటర్వెల్ వచ్చేసరికి...  హీరోతో పాటుగా మరో నలుగురు తప్ప అందరూ జాంబీలు గా మారిపోయి ఉంటారు.  సెకండాఫ్ లో  ఈ ఐదుగురు కలిసి జాంబీలను ఎలా ఎదుర్కున్నారు. వాటి నుంచి తమను తాము ఎలా కాపాడుకున్నారు? ఈ జాంబి సమస్యకు ఎలాంటి పరిష్కారం దొరికింది? వంటి విషయాలు తెలియాలంటే ఈ  జాంబీ రెడ్డి చూడాల్సిందే.
 
 ఎలా ఉంది..

ముందుగా మనవాళ్లకు పెద్దగా పరిచయం లేని ఇలాంటి కొత్త జానర్ ఫిల్మ్ లో సినిమా చేయచ్చు అనే ధైర్యం చేసిన డైరక్టర్ ని అభినందించాలి. హాలీవుడ్‌లో జాంబీ అనేది చాలా ఫేమస్ జానర్. అక్కడ ప్రతీ యేడు ఈ జానర్ లో సినిమాలు చేస్తున్నారు. ఇది చాలా సక్సెస్ ఫుల్ జానర్. అయితే మన దేశంలో హిందీలో ఒకటి.. తమిళ్‌లో ఒకటి వచ్చాయి. ఆ మధ్యన షారూఖ్ కూడా తన బ్యానర్ పై భేతాల్ అనే జాంబి వెబ్ సీరిస్ చేసారు. తెలుగులో మాత్రం మొదటి సారిగా ఈ జాంబీ జానర్ లో సినిమా వచ్చింది. అయితే ఈ జానర్ ని కామెడీతో డీల్ చేయటం డైరక్టర్ చేసిన తెలివైన పని. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్లకు తప్పించి మిగతావాళ్లలో చాలా మందికి ఈ తరహా సినిమాలతో  పరిచయం లేదు.  అలాంటప్పుడు తెరపై జాంబీలను తెరపై భయంకరంగా చూపెడుతూ పూర్తి హారర్ సినిమా తీస్తే కష్టమయ్యేది. కామెడీగా తీసారు కాబట్టి కాసేపు నవ్వుకుంటున్నారు. కాన్సెప్ట్ ఈజీగా డైజస్ట్ అయ్యింది. మనకు లారెన్స్ కాంచన సీరిస్ లో ఇలా హారర్,ఫన్ ని మిక్స్ చేసి సక్సెస్ అయ్యారు. మళ్లీ అ స్దాయిలో ఈ సినిమా అనిపించింది. 

 అలాగే డైరక్టర్ ఈ తరహా సినిమాలు తెలుగులో రాలేదు, చూసేవారికి అవగాహన ఉండదనే విషయం గమనించి, కాన్సెప్టుని నీటుగా బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేసాడు. ఎక్కడా కన్ఫూజ్ చేయలేదు. సెటప్ కు ఫస్టాఫ్ మొత్తం టైమ్ తీసుకున్నా, కథలో డీవియోషన్స్ లేకుండా స్ట్రైయిట్ గా వెళ్లిపోయాడు. ఫస్టాఫ్ నస అనిపించినా సెకండాఫ్ దాన్ని కవర్ చేసేసింది. ఇంటర్వెల్ కు అసలు కథలోకి వచ్చి,సెకండాఫ్ మొత్తం పరుగెట్టించాడు. జాంబీల కాన్సెప్టు అర్దం కావటానికి కాస్త టైమ్ పట్టినా..ఆ తర్వాత ఫన్ బాగానే వర్కవుట్ అయ్యింది. 

కాకపోతే క్లైమాక్స్ సినిమా అప్పటిదాకా జరిగిన రన్ కు సరపడ ముగింపు కాదనిపించింది. ఏదో ముగించాలి కాబట్టి ముగించారు అని లాజిక్ కు అందకుండా ఉంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా సాదా సీదాగానే ఉంది. కొత్త కాన్సెప్టుకు తగినట్లు ఇంకొంచెం కొత్తగా డిజైన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అలా కాకపోవటంతో కాస్తంత ముతకగా అనిపించింది. ఏదైమైనా జాంబీ రెడ్డి టైటిల్ కు తగ్గట్టుగానే కొత్తగా అనిపించింది.   జాంబీలకు ఫ్యాక్షన్ డ్రాప్ అద్దడం అనేది ఖచ్చితంగా కొత్త ఆలోచన.
 

బాగున్నవి

ఇంట్రవెల్ 
 సెకండాఫ్ లో గెటప్ శీను,అన్నపూర్ణమ్మ కామెడీ సీన్స్, 
జోంబీస్ తో జరిగే యాక్షన్ ఎపిసోడ్, చేజింగ్స్

బాగోలేనివి

పస లేని ఫస్టాఫ్
కలిసిరాని క్లైమాక్స్
సోసోగా అనిపించే స్క్రీన్ ప్లే
 
టెక్నికల్ గా..

ఈ సినిమాలో టెక్నికల్ గా ఎక్కువ కష్టపడింది  ఆర్ట్ అండ్ మేకప్ టీమ్. వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకొని జోంబీస్ చాలా బాగా క్రియేట్ చేశారు. కాబట్టే సినిమా చూడగలిగాము. జోంబీస్ ఏమాత్రం తేడాగా అనిపించినా...సినిమా తేలిపోయి..నవ్వించటం మాట దేవెడురుగు ...ముందు నవ్వులు పాలయ్యేది. ఆ తర్వాత కెమెరా డిపార్టమెంట్..  అటు రాయలసీమ వాతావరణాన్ని,  ఇటు జగుప్స కలిగంచకుండా జోంబీస్ ని తన విజువల్స్ లో బంధించి మన ముందు పెట్టారు. వీటికి మార్క్ కె రాబిన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేసారు. పాటలు కూడా బాగున్నాయి. దర్శకుడుగా ప్రశాంత్ వర్మ తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాతో దాన్ని కొనసాగించాడు. అయితే ఫస్టాఫ్ ని ఎందుకు పట్టించుకోలేదా అనిపించింది. ఇంటర్వెల్ దాకా సినిమాపై నమ్మకం రాలేదు. మంచి విజువల్స్, మేకింగ్ లతో జాంబి లను అదిరిపోయే స్థాయిలో చూపించిన ప్రశాంత్ వర్మ కథనం పై మరింత వర్కవుట్ చేసుంటే భారీ హిట్ అందుకునేవడనేది నిజం. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. 

నటీ నటుల విషయానికి వస్తే...బాల నటుడిగా.. ఇంద్ర సినిమాలో జూనియర్ ఇంద్రసేనా రెడ్డిగా తొడకొట్టిన తేజ సజ్జా హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. క్యూట్ లుక్ తో తెలుగుకు మరో యంగ్ హీరో దొరికారు అనిపించింది., ఆనంది, దక్ష హీరోయిన్లుగా ఓకే. మిగతా పాత్రల్లో కనిపించే సీనియర్స్ రొటీన్ గా చేసుకుంటూ పోయినా జాంబీలుగా కొత్తగా ఉన్నారు.

ఫైనల్ ధాట్

ఈ సినిమా స్పూర్తితో ..ఇంకెన్ని జాంబీ ప్రయోగాలు తెలుగు తెరపైకి వచ్చేస్తాయనే నిజమైన హర్రర్ మ్యాటర్

--సూర్య ప్రకాష్ జోశ్యుల

Rating:2.75

ఎవరెవరు.. 
నటీనటులు : తేజ సజ్జా, ఆనంది, దక్ష నగార్కర్‌, పృథ్వీ రాజ్‌, గెటప్‌ శ్రీను, అన్నపూర్ణమ్మ, కిరీటి, హరితేజ, రఘుబాబు తదితరులు
సంగీతం: మార్క్‌ కె. రాబిన్
 కెమెరా: అనిత్, 
లైన్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ కుమార్‌ జెట్టి, 
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఆనంద్‌ పెనుమత్స, ప్రభ చింతలపాటి. 
దర్శకుడు : ప్రశాంత్‌ వర్మ
నిర్మాత : రాజశేఖర్‌ వర్మ
విడుదల తేది : 5 ఫిబ్రవరి 2021

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios