ప్రభాస్‌ ప్రస్తుతం మూడు భారీ పాన్‌ ఇండియా చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పుడు మరో సినిమా ఫిక్స్ అయ్యిందా? అవుననే టాక్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. అంతేకాదు ఛార్మి దానికి క్లూ ఇస్తూ ఓ ఫోటోని పంచుకుంది. ఇందులో సోఫాలో ప్రభాస్‌ కూర్చున్నాడు. ముందు డాగ్‌ ఉంది. ఇది అలస్కాకి చెందిన మేల్‌ మ్యూట్‌గా పేర్కొంది ఛార్మి. 

`డార్లింగ్‌.. తొమ్మిది నెలల బేబీ బాయ్‌` అని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. తమకిష్టమైన పెంపుడు కుక్కతో ప్రభాస్‌ ఉన్నాడనే అర్థంలో ఛార్మి పంచుకున్న ఈ ఫోటో అనేక కొత్త అనుమానాలకు తావిస్తుంది. పూరీ కనెక్ట్స్ అని పంచుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. 

ప్రస్తుతం ప్రభాస్‌తో పూరీ కథా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే డాగ్‌ పేరుతో హింట్‌ ఇచ్చారని ప్రభాస్‌, పూరీ ఫ్యాన్స్ గాసిప్పులు  ప్రారంభించారు. మొత్తానికి వీరి కాంబినేషన్‌లో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రాబోతుందన్నమాట అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది పూరీగానీ, ఛార్మిగానీ, ప్రభాస్‌గానీ స్పందిస్తేనే తెలుస్తుంది. పూరీ దర్శకత్వంలో ప్రభాస్‌ ఇప్పటికే `ఏక్‌ నిరంజన్‌`, `బుజ్జిగాడు` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌`లో నటిస్తున్నారు. ఇది షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఇటలీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌ చేస్తుండగా, అందులో దీపికా హీరోయిన్‌గా, అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఓం రౌత్‌ దర్శకత్వంలో `ఆదిపురుష్‌` సినిమా చేయనున్న విషయం తెలిసిందే.