బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్‌ మారిపోయింది. ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌, తన తదుపరి చిత్రాలను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సాహో సినిమాతో మరో నేషనల్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్, ప్రస్తుతం జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ డ్రామా చేస్తున్నాడు. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటికే ప్రకటించాడు ప్రభాస్. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై మహానటి ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ పాంటసీ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఇది ఓ ఫాంటసీ తరహా కథాంశంతో తెరకెక్కుతుందని చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తూ ప్రభాస్ 21 పాన్ ఇండియా కాదు, పాన్‌ వరల్డ్ సినిమా అంటూ ఊరిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కథ జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండనుందట. ఓ సామాన్యుడికి, ఓ దేవకన్య కూతురైన వండర్‌ కిడ్‌కు మధ్య జరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగా ఇదే కథ అయితే ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరికి కొనసాగింపులా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. అసలు విషయం తెలియాలంటే మాత్రం అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.