కథలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. అయితే వాటిని ఎంత కొత్తగా చెప్పామన్నదే ముఖ్యం. ముఖ్యంగా ఆ పాత్రల్లో నటించే వారి ప్రతిభపైనా చాలా పాత్రలు పండుతూంటాయి. అందుకే దర్శక,నిర్మాతలు పాత్రల ఎంపిక విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తూంటారు. ఆ క్రమంలో విలన్ గా కనిపించే వాళ్లను మంచి వాళ్ల పాత్రలోనూ, హీరో,హీరోయిన్స్ ని నెగిటివ్  పాత్రలోనూ చూపించి విభిన్నతకు పట్టం కడతారు. తాజాగా హీరోయిన్ పూర్ణకు అలాంటి ఆఫరే వచ్చిందని వినపడుతోంది. ఆమె తాజాగా ఒప్పుకున్న ఓ సినిమాలో రాజ్ తరుణ్ ప్రేమకు పుల్లపెట్టే పాత్రలో కనిపించబోతుందని సమాచారం. 

 తెలుగులో 'సీమ టపాకాయ్', ‘అవును’, ‘అవును2’, 'అవంతిక' వంటి చిత్రాల్లో నటించిన పూర్ణ  తాజాగా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా తన తరువాతి చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సంప్రదించినట్టు టాక్. ఈ ప్రాజెక్టుకి పూర్ణ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. 

‘ఓరే బుజ్జిగా’ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజా వేడుకతో ప్రారంభించిన ఈ చిత్రం కోసం  ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సినిమాకి అనూప్ రెబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. పూర్ణను లేడీ విలన్‌గా తీసుకుంటుంది కూడా ఈ సినిమా కోసమే. మొత్తానికి డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొండా బ్యూటీఫుల్ హీరోయిన్‌ని మరో లేడీ విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడన్న మాట.

ఇక ప్రస్తుతం పూర్ణ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. 'లాకప్', '100', 'తలైవి' చిత్రాలతో పాటు మరో తమిళ సినిమాకు కూడా పూర్ణ సైన్ చేసింది.

ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో యువ హీరో రాజ్ తరుణ్ నటించిన రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రం ‘ఒరే బుజ్జిగా’ అక్టోబర్ 2 న ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. అదే రోజున విడుదలయ్యే అనుష్క శెట్టి 'నిశ్శబ్దం' సినిమాతో  రాజ్ తరుణ్ పోటీ పడబోతున్నాడు.