ప్రముఖ నటి పాయల్ రోహ్తాగి బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 13 వైభవంగా ప్రారంభమైంది. ఈసారి ఎక్కువగా పేరున్న సెలెబ్రిటీలకే ప్రాధాన్యత ఇచ్చారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహారిస్తున్న సీజన్ 13 కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. 

బిగ్ బాస్ సీజన్ 13లో అమీషా పటేల్‌, కొయినా మిత్రా, సిద్ధార్థ శుక్లా, అబూ మాలిక్‌, రేష్మీ దేశాయ్‌ లాంటి సెలెబ్రిటీలు పాల్గొంటున్నారు. వీరందరిపై పాయల్ రోహ్తాగి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవకాశాలు లేక కాలం చెల్లిన నటులే బిగ్ బాస్ షోలో పాల్గొంటారని కామెంట్ చేసింది. 

సీజన్ 13లో పాల్గొంటున్న సెలెబ్రెటీలకు ప్రస్తుతం ఎలాంటి పనిలేదు. డబ్బు కోసం మాత్రమే వీరంతా బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు అని పాయల్ వ్యాఖ్యానించింది. మరికొందరు పాపులారిటీ లేని సెలెబ్రిటీలు చాలా తక్కువ రెమ్యునరేషన్ కే బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఒప్పేసుకుంటున్నారు అని కూడా కామెంట్ చేసింది. 

తాను కూడా ఎలాంటి పని లేకపోవడం వల్లే బిగ్ బాస్ 2లో పాల్గొనాన్నని పాయల్ చెప్పుకొచ్చింది. దీనితో నెటిజన్లు పాయల్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలు చేయడం ఆపాలని హితవు చెబుతున్నారు.