కరోనా వైరస్‍ (కోవిడ్‌-19) ఎఫెక్ట్‌  వరస పెట్టి సినిమాలపై పడుతోంది. చాలా సినిమా షూటింగ్  లు, రిలీజ్ లు వాయిదాలు పడుతున్నాయి. తాజాగా నాని సినిమాని సైతం వాయిదా వేసారు. అలాగే పవన్ సినిమాపై కూడా ఈ ప్రభావం పడనుందని సమాచారం.. ఈ మహమ్మారి కారణంగా  దిల్‌రాజే నిర్మిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా `వ‌కీల్‌సాబ్‌` విడుద‌ల వాయిదా రూమ‌ర్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాని మే 15న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ తాజాగా జూన్‌కి వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉండ‌టంతో సినిమాని వాయిదా వేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. దీనిపై కూడా క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

ఇక నేచురల్‌ స్టార్‌ నాని, సుధీర్ బాబు నటించిన 'వి' సినిమా విడుదల వాయిదా పడింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్ రాజు,శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వ వహించారు. మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నివేదా థామ‌స్‌, అదితి రావు హైద‌రి హీరోయిన్స్ గా న‌టించారు. సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్టు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.  

ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని భావించినప్పటికీ,  కరోనా వైరస్‌ కార‌ణంగా మూవీని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు శనివారం తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌లో నిర్మాతల మండలి భేటి అయింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్ల మూసివేతపై చర్చించారు. ప్రభుత్వం ఎప్పుడు చెబితే అప్పుడు థియేటర్లు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది.