ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే రోజు బ్యానర్‌ కట్టే క్రమంలో విద్యుత్‌ షాక్‌కి గురై చిత్తూరు జిల్లా కడపల్లి వాసులు రాజేంద్రప్రసాద్‌, సోమ శేఖర్‌, అరుణాచలం మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. వారి కుటుంబాలను అందుకునేందుకు జనసేన కార్యకర్తలు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, దిల్‌రాజు, ఏ.ఎం. రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆర్థిక సాయం ప్రకటించారు. 

తాజాగా ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు జనసేన నాయకులు అందజేశారు. అందరు ప్రకటించగా వచ్చిన మొత్తాన్ని చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.13.25 లక్షలు, ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.1.25లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. 

ఈ సందర్బంగా పవన్‌ కళ్యాణ్‌ ఆర్థిక సాయం ప్రకటించిన అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, దిల్‌రాజు, ఏ.ఎం.రత్నం, మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్‌, నవీన్‌లకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడం విశేషం. ఇందులో రామ్‌చరణ్‌ ముగ్గురు బాధితులకు కలిపి రూ. 7.5లక్షలు(ఒక్కొక్కరికి 2.5లక్షలు), అల్లు అర్జున్‌ ఆరు లక్షలు(ఒక్కొక్కరికి రెండులక్షలు), మైత్రీ మూవీ మేకర్స్,  దిల్‌రాజు, ఏ.ఎం రత్నం ఆరు లక్షల(ఒక్కొక్కరికి రెండు లక్షలు) చొప్పున అందజేశారు.