పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పోలాండ్ రాయబారి ఆడమ్ బుర్కోవస్కీతో కలిసి సికింద్రాబాద్‌లోని సెయింట్‌ మేరీస్‌ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేశారు. ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నా లెజ్‌నోవాతో కలిసి పవన్‌ చర్చికి చేరుకున్నారు. అనంతరం ప్రశాసన్‌నగర్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో పోలాండ్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ దంపతులకు ఆడమ్ దంపతులు బహుమతులు అందజేశారు.. తర్వాత పవన్ భార్య అన్నా వారిద్దరికీ బహుమతులను అందించారు.

 

అనంతరం కొద్ది మంది ప్రత్యేక ఆహ్వానితులు, విదేశీ విద్యార్థులతో పవన్, ఆడమ్‌లు ముచ్చటించారు. ఈ సమయంలో తనకు హిందీ వచ్చని చెప్పిన ఆడమ్... హిందీలోనే మాట్లాడారు. అంతేకాదు 'ప్యార్ హువా' అంటూ బాలీవుడ్ పాటను ఆలపించి ఆశ్చర్యం కలిగించారు. దీంతో, పవన్ సహా అందరూ కరతాళధ్వనులతో అభినందించారు.ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ చాలా తెలివైనవారని ప్రశంసలు కురిపించారు. భారతీయ గొప్ప నటుల్లో పవన్ ఒకరని కితాబిచ్చారు. పవన్‌తో మాట్లాడినప్పుడు తాను ఒక విషయాన్ని గుర్తించాని... పవన్ గొప్ప తెలివైన వ్యక్తని, అతడి మనసులో మంచి మంచి ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలాండ్‌లో సినిమా షూటింగ్ లు చేయాలని, అందుకు పవన్ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తాను తప్పకుండా సహకరిస్తానని చెప్పారు.