టాలీవుడ్ సినీ పెద్దలు అంతా కదలి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ తో జరిపిన చర్చలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా తక్కువ మందితో, ఇండోర్ లో చేసే వీలున్న రీ ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని, తర్వాత దశలో జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించాలని, చివరగా పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సినీ పరిశ్రమ బతకాలని, అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దని సిఎం తెలిపారు. అందుకోసం సినిమా షూటింగులను వీలైనంత తక్కువ మందితో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణకు అనుసరిస్తున్న మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుకోవాలని చెప్పారు. 

ఈ వార్త పవన్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న టీమ్ కు,పవన్ ఫ్యాన్స్ కు ఎక్కువ ఆనందాన్ని కలిగించిందని సమాచారం. మామూలు రోజుల్లో అయితే ఇది పార్టీ చేసుకునేటంత వార్త అని మెసేజ్ లు చేసుకుంటున్నారట. ఎందుకంటే.. వకీల్ సాబ్ షూటింగ్ కేవలం కొద్ది రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. అది పూర్తి చేసుకుంటే రిలీజ్ కు రెడీ పెట్టచ్చు. థియోటర్స్ కు ఫర్మిషన్స్ రాగానే మొదటవరసలో రిలీజ్ కు ఈ సినిమాని పెట్టచ్చు. షూటింగ్ లు మొదలు కానున్నాయనే వార్త పవన్ ని సూపర్ ఎక్సైట్ చేసిందంటున్నారు. సాధ్యమైనంత మేరకు షూటింగ్ డేట్స్ తగ్గించి, జాగ్రత్తలతో  ముగించమని పవన్ చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారట. టీమ్ మొత్తం ప్రస్తుతం ఫోన్ లలో డిస్కస్ చేస్తూ పనుల్లో పడినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఫ్యాన్స్ కేసీఆర్ కు థాంక్స్ చెప్పుకుంటూ తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు  సోషల్ మీడియాలో. 

ఇక నిన్న కేసీఆర్ తో జరిగిన మీటింగ్ లో సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని తో సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కోసం రీ ప్రొడక్షన్, షూటింగు నిర్వహణ మరియు థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎంత మందితో షూటింగులు నిర్వహించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే పలు ఇతర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగ ప్రముఖులను ముఖ్యమంత్రి కోరారు.

ఆ తర్వాత ప్రభుత్వం ఖచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతి ఇస్తుందని సిఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగులు నడిచిన తర్వాత, అప్పటికే పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇచ్చారు.