కథేంటి

అనగనగా ఓ నల్లబ్బాయి...పేరు జయకృష్ణ(సుహాస్)..ఊరు మచిలీ పట్నం. మనిషి మంచోడు.  పాలు అమ్మకుంటూ జీవితం గడిపే అతనికి తన శరీర రంగు వల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్  ఉంటుంది. ఇంజినీరింగ్ చదువుకుంటున్న టైమ్ లో దీప్తి(చాందిని చౌదరి)ని చూసి మనసు పారేసుకుంటాడు.  ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఆమెకు తన మనస్సులో ఏముందో చెప్పలేడు. అయితే కాలం ఆమెకు దగ్గరయ్యే  అవకాసం ఇస్తుంది. జ‌య కృష్ణ మంచి త‌నం,వ్యక్తిత్వం చూసి, దీప్తీ కూడా ఇష్ట ప‌డుతుంది. అయితే పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినా అందరికీ తెలిసిపోయినట్లు...మనోడు సీక్రెట్ గా తన ప్రేమ కథను లాగిస్తున్నా... ఓ రోజు ఆమె అన్న ఎస్పై రామరాజు (సునీల్) కు రివీల్ అయ్యిపోతుంది. రామరాజు దో విచిత్ర మనస్తత్వం. తన చెల్లిని ఓ నల్లోడు ప్రేమించటం ఏమిటి అని అడ్డం పడతాడు. తన పోలీస్ తెలివితో ఆ ప్రేమ కథకు ట్విస్ట్ ఇస్తాడు. అక్కడ నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. చివరకు ఈ ప్రేమ కథ సుఖాంతమయ్యిందా.. ఏ మజిలీకి చేరుకున్నది తెలియాలంటే సినిమా చూడాలి

ఎలా ఉందంటే..

పాయింట్ గా ఈ సినిమా కోసం తీసుకున్నది ఈ మధ్యకాలంలో ఎవరూ తెలుగులో డీల్ చేయలేదు. చాలా మంది నిత్య జీవితంలో అనుభవమైన  ఆ సెన్సిబుల్ చిన్న పాయింట్ ని పూర్తి స్దాయి సినిమా కథగా తీర్చిదిద్దటం అంటే మాటలు కాదు.  రచయిత సాయి రాజేష్ కు ఆ విషయంలో హాట్సాఫ్. అయితే దురదృష్టవశాత్తు ఆ పాయింట్ తప్పిస్తే మిగతావి పెద్ద కొత్తగా కనపడవు. నల్లబ్బాయి తెల్లమ్మాయి అనే పాయింట్ తప్ప మిగిలినదంతా రొటీన్ గానే చాలా సార్లు చూసినట్లే అనిపిస్తుంది.  ఏమి లేని ఓ కుర్రాడు, పెద్దింటి అమ్మాయి మధ్య లవ్ స్టోరీ సినిమాలనే గుర్తు చేస్తుంది.  దాంతో  అనుకున్నంత ఎంగేజింగ్ గా, ఎంటర్ టైనింగ్ గా సినిమా అనిపించలేదు.  సినిమా క్లైమాక్స్  మాత్రం చాలా ఎమోషనల్ గా రాసుకున్నారు. అయితే అప్పటిదాకా జరిగిన కథలో  ఆ స్దాయి కనపడదు. తెలుగు డైలాగులతో ఓ తమిళ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో,హీరోయన్స్ మధ్యన  ఎమోషనల్ బాండింగ్ ని మరింతగా  ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేదేమో. అప్పుడు క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉండేది. అయితే కొన్ని సీన్లలో స్పేస్ తీసుకుని మంచి మంచి విషయాలు చెప్పాలని ప్రయత్నం చేసారు. ఏదైమైనా ఓ చిన్న సినిమాని యాంటి క్లైమాక్స్  తో తీసే ధైర్యం చేసిన టీమ్ సిన్సియర్ ఎఫెర్ట్  మాత్రం గ్రేట్. కామెడీ డోస్ మరింత పెంచింతే ఈ సినిమా మరింత నిండుతనం వచ్చేది.  ‘ప్రేమించిన వాళ్లను అందనంత ఎత్తులో నుంచోబెట్టడమే నిజమైన ప్రేమ’ అని సినిమా ప్రారంభంలో చెప్పింది మాత్రం ఓ డైలాగు గానే మిగిలిపోయింది.
  
టెక్నికల్ గా..

ఈ సినిమాని ఎక్కువ భుజాన మోసింది.. కాల‌భైర‌వ‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌, బిట్ సాంగ్స్ . దర్శకుడు సినిమాని కళాత్మకంగా మలిచే ప్రయత్నం చేసారు. మంచి సబ్జెక్టు పడితే తెలుగుకు మంచి డైరక్టర్ దొరికినట్లే.   అయితే కథలో మెలో డ్రామా మరీ ఎక్కువ అవటం, డల్ నేరేషన్ డైరక్షన్ ప్రతిభను హైలెట్ కానివ్వలేదు.  డైలాగులు విషయానికి వస్తే..బాగా రాసుకున్నారు. కానీ చాలా సార్లు సీన్స్ లో  బాగున్న డైలాగులు.. డ్రామాలో కొట్టుకుపోయాయి .దానికి తోడు అశ్లీల డైలాగులు ...పిల్లలతో కలిసి చూడాలంటే ఇబ్బందికరమే వైవా హర్ష టైమింగ్, డైలాగులు ఎంగేజింగ్ గా ఉన్నాయి. పాటలు ఎంత గొప్పగా ఉన్నా ఓటీటిల్లో చూసేటప్పుడు స్కిప్ చేద్దామనిపిస్తూంటాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే..మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చారు.   ఎడిటింగ్ కాస్త మొహమాటపడ్డాడు అనిపించింది. ‌, ఆర్ట్ వ‌ర్క్ ,మిగతా డిపార్టమెంట్స్ సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. నటీనటులు విషయానికి వస్తే అందరూ కష్టపడ్డారు. సుహాస్ జయకృష్ణ పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. సుహాస్ రూపం - స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు కరెక్టుగా సరిపోయాయి.సునీల్ నెగెటివ్ రోల్ లో ఫెరఫెక్ట్ ‘ఫిట్’ అనిపించేలా కష్టపడ్డాడు.  ప్రొడక్షన్ వ్యాల్యూస్  గురించి ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. ఉన్నంతలో  తక్కువ బడ్జెట్ తో కానిచ్చేశారు. ఆ కథ కూడా అంతకు మించి  డిమాండ్ చేయదు. 
 
ఫైనల్ థాట్

ఓటీటిలో చూడటానికి అభ్యంతరం లేని వ్యక్తిత్వ వికాస సినిమా 

రేటింగ్ : 2.5/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
--------------------

నటీనటులు : సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులు. 
సంగీతం: కాలభైరవ,
 కథ: సాయి రాజేష్ నీలం, 
ఆర్ట్: క్రాంతి ప్రియం, 
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి,
 ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్, 
ఫైట్స్: ఎ.విజయ్, 
సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్,
 సహ నిర్మాత : మణికంఠ
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సందీప్ రాజ్
ఎక్కడ చూడాలి? : ఆహా (ఓటీటీ)
విడుదల తేదీ: 23 – 10- 2020