డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన మరో టాలీవుడ్ నిర్మాత.. అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు
టాలీవుడ్ నుంచి డ్రగ్స్ పూర్తిగా దూరం కాలేదు. ఆ మధ్యన నిర్మాత కెపి చౌదరిని పక్కా ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు.
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ లో ఉన్న కొందరు టాప్ సెలెబ్రిటీలు పోలీస్ విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వివాదం కాస్త చల్లబడినప్పటికీ అప్పుడప్పుడూ డ్రగ్స్ కి సంబంధించిన కేసులో తెరపైకి వస్తూనే ఉన్నాయి.
టాలీవుడ్ నుంచి డ్రగ్స్ పూర్తిగా దూరం కాలేదు. ఆ మధ్యన నిర్మాత కెపి చౌదరిని పక్కా ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడి వద్ద డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి విచారణ మొదలు పెట్టిన పోలీసులు ఫోన్ కాల్స్, గూగుల్ డ్రైవ్ ఆధారంగా సంచలన విషయాలు వెలుగులోకి తీస్తున్నారు. కెపి చౌదరి కాల్ డేటాలో సినీ, టివి రంగానికి చెందిన కొందరు సెలెబ్రిటీల నంబర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు వారితో కె పి చౌదరి వందలకొద్దీ ఫోన్ కాల్ సంభాషణ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
అయితే తాజాగా మరో సినీ నిర్మాత డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతని నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడి మల్కాపురం పోలీసులతో కలసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు పక్కా గా వలపన్ని ముగ్గురు నైజీరియన్లతో పాటు సుశాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నైజీరియన్ల సహాయంతో సుశాంత్ రెడ్డి డ్రగ్స్ దందా సాగిస్తూ పలువురికి విక్రయిస్తున్నారట.
సుశాంత్ రెడ్డి నుంచి డ్రగ్స్ కొన్న వారిలో ఓ మాజీ ఎంపీ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ అయిన కెపి చౌదరి.. సుశాంత్ రెడ్డితో పలు మార్లు ఫోన్ సంభాషణ సాగించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సుశాంత్ రెడ్డి.. ఇప్పుడు అరెస్ట్ అయిన సుశాంత్ రెడ్డి ఒక్కరేనా లేదా వేరా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా తరచుగా వెలుగులోకి వస్తున్న డ్రగ్స్ కేసులు టాలీవుడ్ కి మాయని మచ్చలా మారుతున్నాయి.
కెపి చౌదరి డ్రగ్స్ వివాదంలో సురేఖ వాణి, నటి జ్యోతి లాంటి సినీతారల పేర్లు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో తమ ప్రమేయాన్ని వారు ఖండించారు.