చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. జయప్రకాశ్ రెడ్డి మరణం మరిచిపోక ముందే మరో నటుడు కన్నుమూశారు. ఒడియా చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు అజిత్ దాస్ మరణించారు. నిన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడినట్లు సమాచారం. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే అజిత్ దాస్ మరణం వెనుక కారణం ఇంకా తెలియరాలేదు. ఆయన కోవిడ్ తో కూడా మరణించే అవకాశం కలదని సమాచారం.దీనితో పరీక్షలు నిర్వహిస్తూ ఉండగా రిజల్ట్ రావాల్సి ఉంది. అజిత్ దాస్ వయసు 71ఏళ్లు అని తెలుస్తుంది. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. 

అజిత్ దాస్ మరణం గురించి తెలుసుకున్న ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రఘాడ సంతాపం తెలియజేశారు. అలాగే సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్ దాస్ మరణంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్టూడెంట్ అయిన అజిత్ దాస్ 60కి పైగా చిత్రాలలో నటించారు.మరికొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. 

ఉత్కళ్ సంగీత్ మహావిద్యాలయ డైరెక్టర్ గా కూడా అజిత్ దాస్ పనిచేశారు. 1976లో వచ్చిన సింధూర బిందు మూవీతో అజిత్ దాస్ నటుడిగా మారారు. 1980లో విడుదలైన హకీమ్ బాబు, తుండా బైడా చిత్రాలు అజిత్ దాస్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అజిత్ దాస్ చివరి చిత్రం ఇష్క్ పుని థారే 2018లో విడుదలైంది. ఇక సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.