ఆర్ ఆర్ ఆర్ రూపంలో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, చరణ్ దీక్షల బాటపట్టారు. తమకు ఇంత పెద్ద విజయం అందించిన దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.  


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల మార్క్ దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయడం విశేషం. నైజాం, యూఎస్ లో వంద కోట్ల మార్కు చేరుకొని సరికొత్త చరిత్ర లిఖించింది. ఆర్ ఆర్ ఆర్ ఇంత పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమకు భారీ విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 

అదే క్రమంలో తమ ఇష్ట దైవాల మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన వెంటనే చరణ్ అయ్యప్ప మాల ధరించారు. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలు జరిపి దీక్ష చేపట్టడం జరిగింది. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చరణ్ (Ram Charan)మాలలోనే హాజరయ్యారు. ముంబైలో కూడా ఆయన చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడం మీడియా దృష్టిని ఆకర్షించింది. 

కాగా ఎన్టీఆర్ (NTR) సైతం దీక్ష తీసుకోనున్నారని సమాచారం అందుతుంది. ఎన్టీఆర్ తన ఇష్ట దైవం ఆంజనేయ స్వామి మాల ధరించడానికి సిద్ధమయ్యారట. రేపటి నుండి 21 రోజులు ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్షలో ఉంటారట. చరణ్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తారు.కానీ ఎన్టీఆర్ అలా దీక్షలు తీసుకున్న దాఖలాలు లేవు. మరి మిత్రుడు చరణ్ సలహా మేరకో లేక మొక్కు కారణంగానో ఈసారి ఆంజనేయ దీక్ష ధరించనున్నారని తెలుస్తుంది. 

మరోవైపు ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ కి సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 30వ(NTR ) చిత్రంగా కొరటాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గనున్నాడట. అలాగే మూవీ బడ్జెట్ కూడా రూ. 300 కోట్లని సమాచారం. గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ ఇది పాన్ ఇండియా మూవీ అని ధృవీకరించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా అలియా భట్ (Alia Bhatt)నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక సమాచారం కూడా అందింది. అనంతరం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చేస్తారు.