అనుష్క, ఆర్‌ మాధవన్ జంటగా నటిస్తున్న చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్‌ మాడిసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. తెలుగులో రానా, తమిళంలో విజయ్‌ సేతుపతి విడుదల చేశారు. 

సాక్షి(అనుష్క) స్నేహితురాలు సోనాలి మర్డర్‌ మిస్టరీ చుట్టూ ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ చెబుతుంది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తించేలా ట్రైలర్‌ సాగింది. అనుష్క పెయింటింగ్‌కి సెలబ్రిటీ మ్యూజీషియన్‌ అయిన మాధవన్‌ మంత్రమగ్ధుడవుతాడు. అలాగే మాధవన్‌ సంగీతానికి అనుష్క బాగా ఇంప్రెస్‌ అవుతుంది. అనుష్కకి కావాల్సిన పెయింటింగ్‌ కోసం ఓ ఫారెస్ట్ లోని ఇంటికి అనుష్క, మాధవన్‌ వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది. అసలు సాక్షి ఎవరు, ఆంటోని ఎవరు, వీరి వెనకాల ఏముందు, సోనాలి హత్యకు కారణమేంటి? ఇంతకి సోనాలి ఎవరు ? అనే ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారంగా ట్రైలర్‌ సాగింది. 

`మీ పెయింటింగ్‌తో మాటలు రానివ్వకుండా చేశావని` అనుష్కని ఉద్దేశించి మాధవన్‌ చెప్పడం, `ఘోస్ట్ ని చూశావా ` అని అడగ్గా మైఖేల్‌ `అవును..నా మాజీభార్య` అని చెప్పడం, `ఇదంతా పాతికేళ్ళ అమ్మాయి ఒక్కతే చేసిందా` అని శ్రీనివాస్‌ అవసరాల చెప్పడం, అలాగే ఏదో జరుగుతుందని అంజలి అనడం, నెమ్మదిగా  చెబితే ఆమె అర్థం చేసుకుంటుందని సుబ్బరాజు చెప్పడం`,  విట్‌నెస్‌ మూగనా అని మైఖేల్‌ చెప్పడం వంటి డైలాగులు సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. 

అయితే ట్రైలర్‌లో ఆర్టిస్టులు చెప్పే భాష అంతగా ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేదు. మొత్తంగా సస్పెన్స్ గా సాగే ఈ ట్రైలర్‌ సినిమాపై మాత్రం మరింత ఇంట్రెస్ట్ ని పెంచిందనే చెప్పాలి. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది.