కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా యంగ్ హీరో  నిఖిల్‌ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉండగా.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న నిఖిల్‌-పల్లవి వివాహం చేయాలని నిర్ణయించారు.

 అయితే ఇటీవల లాక్‌డౌన్‌ను‌ మే 17 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో మరోసారి నిఖిల్‌ వివాహం వాయిదా పడింది. అయితే తాజాగా ఆయన రేపే వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా గొడవంతా ముగిసాక వివాహం  చేసుకుందామని అనుకున్నా.. హిందూ పంచాంగాల ప్రకారం మూఢం, మంచి రోజులు లేకపోవడంతో నిర్ణయం మార్చుకుని అర్జెంట్ గా చేసేసుకుంటున్నాడని ఆ వార్తల సారాంశం.

హైదరాబాద్  నగర శివార్లలోని ఓ ఫామ్ హవుస్ లో పెళ్లి జరగబోతోందని చెప్తున్నారు.లాక్ డౌన్ కారణంగా ఇరువైపులకు చెందిన అతి కొద్ది మందితో ముఖ్యమైన వాళ్ళతో వివాహ కార్యక్రమం నిర్వహించబోతున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. వార్త నిజమే అయితే నిఖిల్ కు వివాహ శుభాకాంక్షలు.