డ్రగ్స్ విచారణతో ఇప్పటికే కన్నడ పరిశ్రమ, హిందీ పరిశ్రమ షేక్ అవుతున్నాయి. దీపికా పదుకునే వంటి స్టార్స్ తో పాటు రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ ఇప్పటికే ఎన్సీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో నలుగురు నటుల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిలో తెలుగు హీరోలు కూడా ఒకరిద్దరు ఉన్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. వీరందరికీ త్వరలోనే ఎన్సీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఇక విచారణలో పేర్లు బయటకు వచ్చిన అందరి ఫోన్లపై ఎన్సీబీ అధికారులు నిఘా పెట్టారు. తెలుగు సినీ నటులకు కూడా సమన్లు జారీ అయ్యే అవకాశం ఉందనే వార్తతో తెలుగు ఇండస్ట్రీ ఆందోళనకు గురవుతోంది. రెండేళ్ల క్రితం డ్రగ్స్ విచారణ టాలీవుడ్ ని వణికించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విచారణ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసు బయిటకు రావటంతో కొందరికి ముచ్చెమటలు పోస్తున్నాయని అంటున్నారు. అయితే ఇంతకీ ఆ నటులు ఎవరనేది మాత్రం లీక్ కాలేదు. 

మరో ప్రక్క డ్రగ్స్‌ వ్యవహారంలో బాలీవుడ్‌ ముగ్గురు ప్రముఖ హీరోలు భాగస్వాములేనని ఎన్‌సీబీ గుర్తించింది. స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న కొందరు డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి, ఎన్‌సీబీ విచారించనుంది. సదరు బడా హీరోలు నోరు విప్పితే మొత్తం గుట్టు రట్టు కావడం ఖాయం. ప్రస్తుతం వారందరి ఫోన్లపై ఎన్‌సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.