డ్రగ్‌ కేసు బాలీవుడ్‌ని వణికిస్తుంది. సుశాంత్‌ మరణంతో ప్రారంభమైన దుమారం ఇప్పుడు అనేక కోణాల్లో బాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. డ్రగ్స్ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె పేరు రావడంతో హిందీ చిత్ర పరిశ్రమ వర్గాల్లో గుబులు స్టార్ట్ అయ్యింది. తమ పేరు ఎప్పుడు వస్తుందో అనే ఆందోళనలో ఉన్నారు. 

ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి చెప్పిన పేర్లని బట్టి నార్కొటిక్‌ కంట్రోల్ బ్యూరో వారిని విచారిస్తుంది. తాజాగా దీపికా మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌కి ఎన్‌సీబీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆ నోటిస్‌ల్లో తెలిపింది. 

ఇటీవల `డీ`, `కే` కోడింగ్‌తో దీపికా పదుకొనే, ఆమె మేనేజర్‌ కరిష్మా ప్రాకష్‌ మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇది బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. నెటిజన్లు దీపికాని ట్రోల్‌ చేస్తున్నారు. ట్విట్టర్‌ వేదిక విమర్శలు వర్షం కురిపిస్తున్నాయి. అంతేకాదు `బైకాట్‌ దీపికా పదుకొనె` అంటూ నినదిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు దీపికా మేనేజర్‌కి ఎన్‌సీబీ సమన్లు పంపడం మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక నెక్ట్స్ దీపికాకే ఎన్‌సీబీ సమన్లు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా ఆమెకి నోటీసులు వచ్చే ఛాన్స్ ఉందని టాక్‌. ఇక ఈ కేసులో ఇప్పటికే శ్రద్ధా కపూర్‌కి, సారా అలీఖాన్‌కి ఎన్‌సీబీ సమన్లు పంపినట్టు తెలుస్తుంది. అలాగే రకుల్‌ వంటి ఇతర పేర్లు కూడా ఇందులో వినిపించాయి.