గతంలో తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ లో సంచలనంగా మారిన డ్రగ్స్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే. ఈ డ్రగ్స్ వ్యవహారంలో చాలా కాలంగా టాలీవుడ్ లో నడుస్తున్న డ్రగ్స్ మాఫియాకి సంబందించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. చాలా మంది సినీ ప్రముఖులు ఈ కేసులో ఇరుక్కున్నారు.డ్రగ్స్ డీలర్స్ తో డైరక్ట్ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కేసులు నమోదు చేశారు.  కానీ ఒక్కటంటే.. ఒక్క సారి కూడా ఎవరికీ శిక్ష పడలేదు. ఆ తర్వాత సిట్ బృందం డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సంగతి ప్రక్కన పెడితే...ఇప్పుడు కన్నడ సినిమా పరిశ్రమని  డ్రగ్స్ భూతం భయపెడుతోంది.
 
వివరాల్లోకి వెళితే...బెంగళూరులోని కల్యాణ్ నగర్‌లో ఉన్న రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 21న రూ. 2.20 లక్షల విలువైన 145 ఎండీఎంకే (మెథిలిన్ డయాక్సీ మెథాపెటమిన్) మాత్రలను పోలీసులు సీజ్ చేశారు. రహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనక కర్ణాటక చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకులు, పలువురు నటులు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు. 

జర్మనీ, ముంబై నుంచి ఆన్‌లైన్ ద్వారా మాదకద్రవ్యాలను వీరు అక్రమంగా కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన సినీ, ఇతర రంగాల ప్రముఖులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.  అయితే ఆ ప్రముఖుల పేర్లును వెల్లడించటానికి అధికారులు ఇష్టపడలేదు.