2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ప‌లువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ భాగోతం బయటపడి ఉలిక్కిపడేలా చేసింది.

 సుశాంత్‌సింగ్‌ కేసులో భాగంగా బయటపడ్డ డ్రగ్స్‌ కేసు మొన్నటి వరకూ బాలీవుడ్‌లో సంచలనం  సృష్టించిన విషయం తెలిసిందే. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ముంబయిలోని ఒక ప్రముఖ హోటల్‌లో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లుగా సమాచారం రావడంతో వెంటనే ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మిరా రోడ్‌లోని ఓ హోటల్‌లో జరిపిన ఈ దాడుల్లో టాలీవుడ్‌లో పలు సినిమాలలో నటించిన నటిని అధికారులు గుర్తించారు. ఈమె కూడా ఈ డ్రగ్స్ దందాలో కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. 

టాలీవుడ్ నటితో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకొని, వారి వద్ద ఉన్న 400 గ్రాముల సరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న చాంద్‌ మహమ్మద్‌ను నుంచి 400గ్రాముల మెఫెడ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8-10లక్షల వరకూ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.  ఇక డ్రగ్స్‌ సరఫరా చేసే సయ్యద్‌ పరారీలో ఉన్నట్లు ఎన్‌సీబీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే.. ఆ టాలీవుడ్‌ నటి ఎవరన్నది తెలియాల్సి ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఈ విషయం ఓ హాట్ టాపిక్ గా మారింది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఫలానా అని ఎవరూ ధైర్యంగా చెప్పటం లేదు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ వ్యవహారమే కీలకంగా మారింది. ఈ కేసులో సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురిని ప్రశ్నించడం తెలిసిందే.