నవీన్ పోలి శెట్టి ‘జాతిరత్నాలు’ రివ్యూ
చిన్న సినిమాను పెద్ద బ్యానర్స్ భుజాన వేసుకున్నప్పుడు అది ప్రపంచం దృష్టిని ఆకర్షించగలుగుతుంది. లేకపోతే ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా మాట్లాడుకునేవాళ్లే కరువు అవుతారు. ఓపినింగ్స్ రాక ఓదార్పు యాత్రలు చేయాల్సి వస్తుంది. ‘జాతిరత్నాలు’ సినిమాకు ఆ సమస్య లేదు. మహానటి వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి చేసిన సినిమా కావటం, నవీన్ పోలిశెట్టి హీరో కావటం, ఇన్నోవేటివ్ గా సాగిన ప్రమోషన్స్, అశ్వినీదత్ బ్యానర్ అన్ని కలిపి అదిరిపోయే అడ్వాన్స్ బుక్కింగ్స్ కు దారి తీసాయి. అలాగే ట్రైలర్, టీజర్ ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా పరిచయం చేసాయి. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ సినిమా...అంచనాలకు తగినట్లే ఉందా...సినిమా కథేంటి...జాతి రత్నాలు అనిపించుకునేటంత గొప్ప పనులు వాళ్లేం చేసారు..నవ్వించే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
జాతి రత్నాలు బ్యాక్ గ్రౌండ్
జోగిపేటలో బేవర్స్ గా తిరిగే ముగ్గురు కుర్రాళ్లు శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ). బాల్య స్నేహితులైన వీళ్లకు భాధ్యతా,బరువు ఏమీ ఉండవు. కానీ శ్రీకాంత్ తండ్రి ఎక్కడ లేడీస్ ఎంపోరియంలో తనని పెట్టేస్తాడో అని ఓ రోజు బెంగ పట్టుకుంటుంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా ముగ్గురూ తమ ప్రస్దానాన్ని హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారు. అసలే హైదరాబాద్ అందులోనూ ముగ్గరూ అమాయకులు.
దాంతో వీళ్ల తెలివికి తగ్గట్లే ఓ రోజు స్పోర్ట్స్ మినిస్టర్ చాణక్య (మురళి శర్మ) ఎటెమ్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాంతో ముగ్గురూ జైలుకు వెళ్తారు..కోర్ట్ కు వెళ్తారు...అయితే సరదాగా జైలు,కోర్ట్ చూద్దామనుకున్న వాళ్ల కోరిక తీరింది కానీ, బయిటపడే మార్గమేది. అసలే బద్ధకం, నిర్లక్ష్యం కు బ్రాండ్ అంబాసిడర్స్ ..ఇలాంటి వాళ్లు ఎలా బయిటపడ్డారు. అసలు దోషులను ఎలా పట్టించారు. అసలు వీళ్లని ఇరికించటం వెనక ఉన్న కుట్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..
కుట్ర, హత్య అన్నాం కదా అని ఇదేదో మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ తరహా ఓటీటి సినిమా అనుకునేరు. అలాంటిదేం కాదు..పూర్తి కామెడీతో నడిచే సినిమానే. ఎక్కడా ఫన్ మిస్ అవకుండా కాపు కాసుకుంటూ వచ్చాడు డైరక్టర్. చిన్న టౌన్ నుంచి వచ్చిన ముగ్గురు..అమాయకంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటే వాళ్ల పరిస్దితి ఏమిటి..వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు. అందుకు వన్ లైనర్స్, సిట్యువేషన్ కామెడీ సాయం తీసుకున్నాడు. అయితే కథగా చెప్పుకునేందుకు ఈ సినిమాలో ఏమీ ఉండదు. కొన్ని కామెడీ సీన్స్, ఫన్నీ డైలాగులు కలపుకుంటూ వెళ్లిపోయినట్లు ఉంటుంది. ప్రేక్షకుడు మెదడు మీద బరువు వేయకుండా, పూర్తిగా లైటర్ వీన్ కామెడీతో నడపాలనేది డైరక్టర్ ఉద్దేశ్యం కావచ్చు. అది చాలా వరకూ నెరవేరింది. కాకపోతే సినిమా పూర్తయ్యాక..ఏమి చూసారు అంటే ..చెప్పటానికి ఏమీ ఉండదు. కాసేపు నవ్వుకోవటమే చూసేవారి లక్ష్యం అయితే ఈ సినిమా దాన్ని వంద శాతం అందిస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని డైరక్టర్ చేసారనిపించింది. సెకండాఫ్ కు వచ్చేసరికి ఆ జోష్ కొద్దిగా కొరవడింది. సీన్స్ సిల్లిగా మారటం మొదలెట్టాయి. సెకండాఫ్ లో వచ్చే ఇన్విస్టిగేషన్ సీన్స్, క్రైమ్ ఏంగిల్ లాజిక్ లు వెతకద్దని బ్రతిమిలాడుతూంటాయి.
జబర్దస్త్ కూడా పాతబడిపోయిన ఈ రోజుల్లో తెలుగు ప్రేక్షకుడుని నవ్వించటం అంత ఈజీకాదు. అలాగే ఇలాంటి కథలు కొత్తా కాదు మనికి. గతంలో రాజేంద్రప్రసాద్ సినిమాల్లో కనపడేదే. అయితే ఇక్కడ బ్యూటీ అంతా తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడుతూ...ఈ జనరేషన్ కు సంభందించిన కుర్రాళ్లు అమాయకత్వం ప్రతిబింబంచటంలోనే ఉంది. సినిమా అంతా వేరే ప్రపంచంలో ఉన్నట్లుంటుంది. కాబట్టి కథా ,కాకరకాయ అనేది లేకుండా కాసేపు నవ్వేసుకుందామనుకునేవాళ్లకు ఇది మంచి ఆప్షన్ అంతే. క్లైమాక్స్ కూడా చాలా అన్ కన్విక్షన్ గా అనిపిస్తుంది. అయితే పగలబడి నవ్వుతారు. బ్రహ్మానందం బాషలో చెప్పాలంటే అదే మ్యాజిక్కు.
దర్శకత్వం, మిగతా విభాగాలు
ఈ సినిమా దర్శకుడు అనుదీప్ ...మొదట సినిమా పిట్టగోడ చూసిన వాళ్లు..అతనేనా ఈ సినిమా తీసింది అని ఆశ్చర్యపోయే ప్రమాదం ఉంది. అంతలా మార్పు వచ్చింది. సెటైర్, వ్యంగ్యం ఈ స్క్రిప్టులో పుష్కలంగా ఉండటం,వాటిని ప్రెజెంట్ చక్కగా ప్రెజెంట్ చేయటం కలిసొచ్చింది. కథలో భాగంగా వచ్చే లవ్ స్టోరీని ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తే బాగుండేది. అయితే ఆ వెలితిని సూపర్ హిట్ సాంగ్ చిట్టి పూడ్చేసింది. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సెకండాఫ్ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా చేస్తే బాగుండేది. డైలాగులు బాగున్నాయి.
నటీనటుల్లో... జోగీపేట శ్రీకాంత్ క్యారక్టర్ లో నవీన్ పోలిశెట్టి ఇరక్కొట్టాడు. క్లైమాక్స్ కోర్టు ఎపిసోడ్ కేక పెట్టించాడు. ఇ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా నవీన్ కు పోటీ ఇచ్చాడు. అలాగే.. చిట్టి గా ఫరియా అబ్దుల్లా బాగుంది. కోర్ట్ సీన్స్ సినిమాల్లో చూసి ..నిజమైన కోర్ట్ లో వాదించటం బాగుంది.జస్టిస్ బల్వంత్ చౌదరిగా బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
ఫైనల్ థాట్...
లాజిక్ ఎక్కడ ఆగుతుందో అక్కడ డ్రామా మొదలువుతుందనేది సినీ రూల్. కానీ ఇక్కడ లాజిక్ ఇక్కడ ఆగిందో అక్కడే ఫన్ మొదలువుతుంది. అది ఈ సినిమా స్కూల్.
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 3
ఎవరెవరు...
నిర్మాణ సంస్థ: స‌్వప్న సినిమా;
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, నరేష్ తదితరులు;
సంగీతం: రధన్; ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్;
ఆర్ట్: చంద్రిక - అలీ;
ఎడిటర్: అభినవ్ దండా;
నిర్మాత: నాగ్ అశ్విన్;
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.వి. అనుదీప్;
విడుదల తేదీ: 11-03-2021