`ఐనా ఇష్టం నువ్వే` చిత్ర విషయంలో తాను ఎవరినీ మోసం చేయలేదని, చంటి అడ్డాలనే తనని మోసం చేశాడని అంటున్నారు నిర్మాత నట్టికుమార్‌. ఆర్ట్ డైరెక్టర్‌, నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. 

ఈ సందర్భంగా నట్టికుమార్‌ మాట్లాడుతూ, `ఐనా ఇష్టం నువ్వే` చిత్ర హక్కులు అమ్మినందుకుగానూ చంటి అడ్డాలకు రూ.తొమ్మిది లక్షల చెక్‌ని ఇచ్చాను. చెక్‌కి సరిపడా మనీ నా అకౌంట్‌లో ఉంది. కానీ చంటి అడ్డాల చెక్‌ని బ్యాంక్‌లో వేసుకోకుండా, నా మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంటి అడ్డాల చేస్తున్న వైట్‌ కాలర్‌ మోసాలపై ఫిర్యాదు చేశాను. సినిమాను మొదట నాకు అమ్మి, ఆ తర్వాత టైటిల్‌ మార్చి వేరే వాళ్ళకు అమ్మి నన్ను మోసం చేశాడు. 

ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ దృష్టికి తీసుకెళ్ళి లీగల్‌గా పోరాటం చేద్దామనుకున్నా. కానీ చంటి అడ్డాల మాత్రం అన్నింటిని ప్రభావితం చేసి నా మీద ఫిర్యాదు చేశాడు. నేను కూడా తగిన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులపై, కోర్ట్ పై నాకు నమ్మకముంది. నాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా` అని అన్నారు. ఇదిలా ఉంటే నవీన్‌ విజయ్‌ కృష్ణ, కీర్తిసురేష్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి చంటి అడ్డాల తాను నిర్మాత అని చెప్పుకుంటున్న విషయం తెలిసిందే.