ఏదో ఒక కొత్తదనం లేకపోతే ఓపినింగ్స్ కూడా రప్పించుకోవటం కష్టంగా ఉంది. ముఖ్యంగా గత రోజుల్లోలాగ..ఏ పాత్ర చేసినా హీరో ఒకే విధంగా ఉంటే జనం ఏక్సెప్ట్ చేయటం లేదు. వాళ్లు ఏదో ఒక వైరైటీ లేదా వైవిధ్యం కోరుకుంటున్నారు. ఈ విషయం ఇన్నాళ్లకు కళ్యాణ్ రామ్ కు అర్దమైనట్లుంది. కొత్తగా ట్రై చేయాలని ఫిక్సైనట్లున్నాడు. ఆ విషయం రీసెంట్ గా లీక్ అయిన ఓ ఫొటో ద్వారా స్పష్టమైంది. 

వివరాల్లోకి వెళితే...తాజాగా కళ్యాణ్ రామ్ అపోలో లైఫ్ స్టూడియో జిమ్ దగ్గర కెమెరాకు చిక్కాడు. అక్కడ వర్క్ అవుట్స్ పూర్తి చేసుకుని  బయటకు వస్తున్న కళ్యాణ్ రామ్ ని కెమెరాలలో బంధించారు. గుబురు జుట్టు, ఒత్తయిన గెడ్డం, మీసంతో కళ్యాణ్ రామ్ చాలా డిఫరెంట్ గా కనిపించాడు. సహజంగా ఏదైనా కొత్త గెట్ అప్ లోకి మారాల్సినప్పుడు హీరోలు ఇలా ఎక్కువగా జుట్టు పెంచుతారు. దీనితో  కళ్యాణ్ రామ్ గెట్ అప్ మీద ఊహాగానాలు మొదలయ్యాయి. 

నందమూరి కళ్యాణ్ రామ్ సంక్రాంతికి విడుదలైన ఎంత మంచివాడవురా చిత్రం రెండు పెద్ద హీరోల సినిమాల మధ్యన ఘోరంగా నలిగిపోయింది. దాంతో మరో ప్లాప్ మూటగట్టుకున్నట్లు అయ్యింది. ఈ ప్రాజెక్టు తర్వాత కళ్యాణ్ రామ్  తన తదుపరి చిత్రం గురించి ప్రకటించలేదు. అయితే ఇప్పుడు మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో రావణ్ అనే సోసియో ఫాంటసీ చిత్రం చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం కథ 13వ శతాబ్దానికి సంబంధించిన కథ అని, భారీగా సిజీ వర్క్ ఉంటుందని అన్నారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ మీద ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.అయితే ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 

మరో ప్రక్క...కళ్యాణ్ రామ్ నిర్మాతగానూ ఎక్కడా తగ్గటం లేదు. కిక్ తీసి వెనకబడ్డాడనుకుంటే..అదేం లేదని రెట్టించిన ఉత్సాహంతో తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాకు కళ్యాణ్ రామ్ సహనిర్మాతగా వ్యవహిస్తున్నాడు. గతంలో ఆయన తమ్ముడు ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా నిర్మించారు. ఈ చిత్రం ఈ వేసవిలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా ఇదే కావడంతో దీని మీద అంచనాలు గట్టిగా ఉంటాయి.