నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.. అభిమానులకు పండుగ రోజు. ప్రతి ఏటా ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్వయంగా బాలయ్యకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో అలాంటి అవకాశం లేదు. దీంతో బాలయ్య అభిమానులకు బహిరంగ లేఖ రాశారు.

కోవిడ్ 19 నేపథ్యంలో ఎవరూ వ్యక్తిగతంగా వచ్చి తనను కలవొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘ ప్రపంచవ్యాప్తంగా వున్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజ్ఞప్తి. నా ‘‘ 60వ పుట్టినరోజు’’ని మీ ఇంటి పండగలా కనీ,వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

Also Read:బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌.. ఊర మాస్‌ లుక్‌లో బాలయ్య

నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబసభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకునే అదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఈ ‘‘కరోనా’’ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత.

మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతిక దూరం మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలవాలన్న నా ఆకాంక్షికి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది.

Also Read:60వ వసంతంలోకి బాలయ్య.. ఇవే ఆయన స్పెషాలిటీస్...

దయ చేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్ను కలవడానికి రావొద్దని కోరుతున్నాను. ఈ రోజు ద్వారక క్రియేషన్స్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్, మరియు నేను పాడిన పాట విడుదలవుతున్నాయి.

ఆస్వాదించండి... ఆశీర్వదించండి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి. మీ బ్రతుకు ముఖ్యం.. మీ భవిత ముఖ్యం. మీ అందరి క్షేమమే మీరు నాకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం... నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నా అని బాలయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.