పర్సనల్ లైఫ్ లో ఎలా ఉన్నా.. బయటకు వచ్చేటప్పుడు ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఆచి, తూచి మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా రోజుల్లో ప్రతీది పెద్ద సమస్యగా మారుతోంది. అందరూ వేలెత్తి చూపెట్టే పరిస్దితి ఎదురు అవుతోంది. అలాంటి సమస్యే నగ్మాకు ఎదురైంది. 

తెలుగు, తమిళ, హిందీ ఇలా భాషా భేధం లేకుండా అన్ని భాషల్లోని  స్టార్ హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది నగ్మా. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసిన నగ్మా మెల్లిగా ఇక ఫేడవుట్ అవుతున్నాను అనిపించగానే...రాజకీయాల్లోకి ప్రవేశించి బిజీ అయిపోయింది. అలాగే దాదాపు 45 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన ఆమె తాజాగా ఓ విషయంలో నోరు జారి అడ్డంగా బుక్కైంది. దాంతో సోషల్ మీడియా జనం ఆమెను ఓ రేంజిలో ఆడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..
 
తాజాగా ..భారత దేశంలో ముస్లింల సమస్యలు భారత్-పాక్ సంబంధాలపై నగ్మా ఓ  హిందీ చానెల్ చర్చలో  పాల్గొంది. ఈ చర్చలో ఆమెతో పాటు  'తారిక్ పీర్జాదా' అనే పాకిస్తాన్ జర్నలిస్టు కూడా పాల్గొని భారత్ పై విషం కక్కాడు. దీంతో టీవీ చానెల్ ప్రతినిధి కూడా పాకిస్తాన్ జర్నలిస్టుపై మండిపడ్డారు. కాని  నగ్మా మాత్రం  సదురు పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతు తెలపడంతో పాటు, చర్చకు పిలిచి  అవమానిస్తారా అంటూ చానెల్ ప్రతినిధిని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లోనూ ఆమె పాక్ జర్నలిస్టుకు మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. దాంతో న‌గ్మాపై నెటిజ‌న్స్ మండిపడుతున్నారు. అయితే పాకిస్దాన్ మీడియా నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. 

ఇక్కడ భారత దేశంలో పుట్టి ఈ దేశాన్నే వ్యతిరేకిస్తూ పాక్ కు మద్దతు పలికుతావా అంటున్నారు. పాక్ జర్నలిస్టుకు తన మద్దతు కూడా తెలిపినందుకు సోషల్ మీడియా వేదికగా నగ్మాకు చుక్కలు చూపించటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆమెనే కాకుండా తాను ఇప్పుడు కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ పై కూడా మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో నెటిజన్లకు ఇప్పుడు నగ్మా ఏ విధంగా  రిప్లై ఇస్తోందో చూడాలంటోంది మీడియా.