మెగాబ్రదర్ నాగబాబు  తన  యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత మరియు కుటుంబ సంగతులు వివరిస్తారు. మెగా ఫ్యామిలీ అభిమానులకు ఆయన ఈ ఛానెల్ ద్వారా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మెగా బ్రదర్స్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వారి తరపున నాగబాబు సదరు వ్యక్తులకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసిన నాగబాబు కింగ్ నాగార్జున సతీమణి అమలను పొగడ్తలతో ముంచెత్తారు. నటిగా, సామాజిక వేత్తగా ఆమె సేవలను కొనియాడారు. 

ముఖ్యంగా జంతు ప్రేమికురాలిగా ఆమె ఉదార స్వభావాన్ని నాగబాబు ఓ సంఘటన ద్వారా తెలియజేశారు. కాగా కొంత కాలం క్రితం హైదరాబాదు కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ కొండచిలువ పిల్ల రోడ్డు పక్కన కనిపించిందట. దానిని అక్కడున్న కొందరు చంపడానికి సిద్ధం అయ్యారట. అది చూసిన నాగబాబు వారిని వారించి, ఆ కొండచిలువను ఎలాగైనా కాపాడాలని అనుకున్నారట. తన అసిస్టెంట్ తో ఆ పామును పట్టుకొని కేబీఆర్ పార్క్ లోపలికి విసరమన్నారట. 

దానికి అతను భయపడడంతో, దాన్ని ఎలా కాపాడాలని ఆలోచిస్తుండగా మరో వ్యక్తి అమల గారి పేరు గుర్తు చేశారట. బ్లూ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్న  అమల మాత్రమే దానిని కాపాడగలరని నాగబాబు కాల్ చేసి, అమల గారు నేను నాగబాబు, చిరంజీవి గారి తమ్ముడిని ఇలా ఓ పాముని కాపాడాలి అన్నారట. దానితో మీరు ఇంటి నుండి కాల్ చేయండి అన్నారట. అనేక మంది ఆకతాయిల కాల్స్ వస్తాయేమో, చిరంజీవి తమ్ముడినన్నా కూడా నాగబాబును ఆమె గుర్తుపట్టలేదట. ఆమె చెప్పినట్లే పక్కనే ఉన్న తన ఇంటినుండి కాల్ చేసి మాట్లాడగా అమల ఓ సంస్థ గురించి చెప్పి ఆ పామును కాపాడారట.