రివ్యూ: నా నువ్వే

na nuvve movie telugu review
Highlights

కళ్యాణ్ రామ్, తమన్నా ఓ లవ్ స్టోరీ అంటే ఎక్కడో ఓ చిన్న సందేహం కూడా ఉంది. మరి వీటికి ఈ సినిమా ఎలాంటి సమాధానం చెప్పిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం

నటీనటులు: కళ్యాణ్ రామ్, తమన్నా, తనికెళ్ళభరణి, ప్రవీణ్, వెన్నెల కిషోర్ తదితరులు 
సంగీతం: శరత్ 
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరాం 
ఎడిటింగ్: టి.ఎస్.సురేష్ 
నిర్మాతలు: కిరణ్ మువ్వవరపు, విజయ్ వట్టికూటి
దర్శకత్వం: జయేంద్ర 

నందమూరి కళ్యాణ్ రామ్ మొదటినుండి కూడా మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేశారు. అటువంటి హీరో తొలిసారిగా 'నా నువ్వే' చిత్రంలో లవర్ బాయ్ అవతారంలో కనిపించడానికి రెడీ అయ్యాడు. అతడికి జోడీగా తమన్నా కనిపించడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ కళ్యాణ్ రామ్, తమన్నా ఓ లవ్ స్టోరీ అంటే ఎక్కడో ఓ చిన్న సందేహం కూడా ఉంది. మరి వీటికి ఈ సినిమా ఎలాంటి సమాధానం చెప్పిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
వరుణ్(కళ్యాణ్ రామ్) చదువు పూర్తి చేసుకొని అమెరికాలో ఉద్యోగం కోసం బయలుదేరతాడు. కానీ మొదటిసారి ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ మిస్ చేస్తాడు. రెండోసారి ఎయిర్ పోర్ట్ కు బయలుదేరే సమయంలో వరుణ్ కి సంబంధించిన 'లవ్ సైన్స్' అనే పుస్తకం అనుకోకుండా మీరా(తమన్నా) అనే అమ్మాయికి దొరుకుతుంది. ఆ బుక్ ఎక్కడ వదిలేసినా.. తిరిగి మీరా దగ్గరకే చేరుకోవడంతో ఆమె డెస్టినీ అని భావిస్తుంది. ఆ బుక్ లో ఉన్న వరుణ్ ఫోటోను చూసి ఇష్టపడుతుంది. వరుణ్ ఫోటో తన లైఫ్ లోకి రాగానే అన్నీ పాజిటివ్ గా జరుగుతుండడంతో అతడు తనకి లక్కీ అనుకుంటుంది. దీంతో అతడిని వెతికే ప్రయత్నం చేస్తుంటుంది. వరుణ్ సెకండ్ టైమ్ కూడా ఫ్లైట్ మిస్ చేసుకుంటాడు. దీంతో  కొన్నిరోజులు హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటాడు. వరుణ్.. మీరాకు కనిపించినట్లే కనిపించి దొరక్కుండా వెళ్ళిపోతుంటాడు. ఎలాగోలా వరుణ్ ని చేరుకుంటుంది. తన కథ మొత్తం అతడికి చెబుతుంది. డెస్టినీని పెద్దగా నమ్మని వరుణ్.. మీరా ప్రేమకు ఓ పరీక్ష పెడతాడు. మరి ఆ పరీక్షలో మీరా గెలిచిందా..? తను ఎంతగానో ప్రేమించే వరుణ్ ని కలవడం కోసం ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది..? చివరకు ఈ జంట ఒక్కటయ్యారా..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
ప్రేమించే వ్యక్తితో డెస్టినీనే తనను కలుపుతుందని నమ్మకంతో ఉండే అమ్మాయి, డెస్టినీ అనేది మూఢనమ్మకమని భావించే అబ్బాయి.. ఈ ఇద్దరు ఎలా ప్రేమించుకున్నారు..? విడిపోయి మళ్లీ ఎలా కలుసుకున్నారు..? అనే అంశాలతో కథను రాసుకున్నాడు. ఒక పుస్తకం కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం అనే పాయింట్ చాలా కొత్తగా ఉంది. హీరోయిన్ డెస్టినీను నమ్ముతుంది కాబట్టి తనకు ఎదురయ్యే సంఘటన కారణంగా హీరోని ప్రేమిస్తుంది. ఆమె ప్రేమించడానికి బలమైన కారణాలు కనిపించకపోయినా.. ప్రేమకు లాజిక్స్ ఉండవని సరిపెట్టుకోవచ్చు. కానీ హీరోకి అప్పటివరకు డెస్టినీ మీద నమ్మకం లేనట్లు చూపించి దాని కారణంగానే హీరోయిన్ పై ప్రేమ పుట్టినట్లు చూపిస్తారు. దీంతో అక్కడ హీరో క్యారెక్టరైజేషన్ దెబ్బతింది.

ఇద్దరూ ప్రేమించుకోవడం మొదలుపెట్టిన తరువాత మళ్లీ హీరో క్యారెక్టరైజేషన్ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. తెరపై ఈ జంట రొమాన్స్, కెమిస్ట్రీ ఆడియన్స్ కు పెద్దగా నచ్చకపోవచ్చు. తమన్నా తన పెర్ఫార్మన్స్ తో తెరను మొత్తం ఆక్యుపై చేస్తుంటే.. కళ్యాణ్ రామ్ మాత్రం ఆమె స్పీడ్ ను అందుకోలేకపోయాడు. ఒక అమ్మాయి తను ప్రేమించే వ్యక్తిని చేరుకోవడం కోసం పడే ఆత్రం, ఎమోషన్ తన కళ్లతోనే పలికించింది తమన్నా. ఇద్దరూ గొడవపడి దూరమయ్యే సందర్భంలో ఆమె పడే వేదన, తిరిగి కలుస్తామా..? లేదా..? అనే సందేహాలు కలిగే సమయంలో తమన్నా అధ్బుత నటన కనబరిచింది. ఇప్పటివరకు తమన్నాకు ఏ సినిమాలో కూడా ఈ స్థాయిలో నటన పండించే అవకాశం రాలేదనే చెప్పాలి. దీంతో ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో చేలరేగిపోయింది. స్క్రీన్ మొత్తం తనే కనిపిస్తుంటుంది.

సన్నివేశంలో మిగిలిన నటీనటులు కనిపిస్తున్నా.. అందరి దృష్టి తమన్నా మీదే ఉంటుంది. అంతగా ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. సినిమా ప్రధమార్ధం మంచి ఫీల్ తో నడిపించారు. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ప్రేమికులు ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణాలు కనిపించవు. దీంతో కథ కాస్త సిల్లీగా ఉందనిపిస్తుంది. ఇక హీరోయిన్ ప్రతిదానికి డెస్టినీ డెస్టినీ అనడం కూడా ఆడియన్స్ ను విసిగిస్తుంది. చిన్న కమ్యునికేషన్ గ్యాప్ తో విడిపోయిన జంట ఎఫ్ఎం ద్వారా తిరిగి కలిసే సన్నివేశాలు ఆడియన్స్ సహనానికి పరీక్ష. కొన్ని చోట్లా సినిమా సీరియస్ గా నడుస్తున్నా.. ఎమోషన్ మాత్రం సరిగ్గా పండించలేకపోయారు. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సినిమాకు పెద్ద మైనస్.

ఇద్దరి ప్రేమికుల కథను ఎంతోఅందంగా తెరపై ఆవిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. కళ్యాణ్ రామ్ చూడడానికి కొత్తగా, అందంగా కనిపించారు. కానీ తమన్నాతో ఆయన కాంబినేషన్ సెట్ కాలేదు. తెరపై వీరిద్దరి రొమాన్స్ ను చూడడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ తో తమన్నా అనేది మిస్ మ్యాచ్. ఇదే కళ్యాణ్ రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినప్పటికీ ఈ కథలో మరో హీరో ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో కళ్యాణ్ రామ్ పాత్రను మొండిగా చూపించడం ఆడియన్స్ కు రుచించదు. తమన్నా తన అందం, అభినయంతో మెప్పించినప్పటికీ  సినిమాను మొత్తం తన భుజాలపై నడిపించలేకపోయింది. ప్రవీణ్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, బిత్తిరి సత్తి వంటి కమెడియన్లను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. తనికెళ్ళభరణి, పోసాని కృష్ణమురళి పాత్రలు ఆడియన్స్ ను మెప్పిస్తాయి. పిసి శ్రీరాం ఫోటోగ్రఫీ ఎంతో అందంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో కలర్ ఫుల్ గా చూపించారు.

హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ ను ఎంతో బాగా పిక్చరైజ్ చేశారు. తమన్నాను మరింత అందంగా తెరపై చూపించారు. లీడ్ పెయిర్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. శరత్ అందించిన 'నిజమా మనసా..','ప్రేమికా..','నా నువ్వే' పాటలు వినడానికి, చూడడానికి బాగున్నాయి. టెక్నికల్ గా సినిమాను మంచి క్వాలిటీతో నిర్మించినప్పటికీ కథ, కథనాల్లో తప్పులు దొర్లడంతో సినిమా ఆశించిన అంచనాలను రీచ్ కాలేకపోయింది. అయినప్పటికీ తమన్నా ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. ఆమె కోసం ఒకసారి ఈ సినిమాను చూసే సాహసం చేయొచ్చు. రెగ్యులర్, రొటీన్ సినిమాలకు భిన్నంగా దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. కానీ సినిమాను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చిత్రీకరించలేకపోయారు. ప్రేమకథలను లాజిక్స్ లేకుండా ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. 

రేటింగ్: 2/5 

loader