`ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు` అనే పాట తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబీ సినిమాలోనిది ఈ పాట. ఈ పాటకు స్వరాలందించిన సంగీత దర్శకుడు శశీ ప్రీతమ్‌కు తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. గురువారం ఆయనకు గుండెపోటు రావటంతో కుటుంబం సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు బంజార హిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స జరుగుతోంది.

ప్రస్తుతం శశీ ప్రీతమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందనీ వైద్యులు వెల్లడించారు. `శశీ ప్రీతమ్‌ను క్రిటికల్ కండిషన్‌లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు ఆయనకు హర్ట్ ఎటాక్‌ వచ్చినట్టుగా గుర్తించారు. యాంజీయోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంద`ని వైద్యులు వెల్లడించారు.

1995లో రిలీజ్‌ అయిన గులాబీ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన శశీ ప్రీతమ్‌ తరువాత సముద్రం, హ్యాండ్సప్‌, రాఘవ సినిమాలకు సంగీతమందించాడు. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టిన ఆయన ముఖబిర్‌ అనే సినిమాకు సంగీతమందించాడు. పలు చిత్రాలకు నేపథ్య సంగీతం కూడా అందించాడు శశీ ప్రీతమ్‌.