సల్మాన్ ఖాన్ పై ఎన్ని వివాదాలు, కేసులు ఉన్నాయో అందరికీ తెలిసింది. తాగిన మైకంలో కారు నడిపి కొందరు అమాయకుల ప్రాణాలు తీశారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడిన కేసు ఆయనను ముప్పు తిప్పలు పెట్టింది. హీరోయిన్స్ తో అఫైర్స్, గొడవల గురించి చెప్పాల్సిన పనిలేదు. సల్మాన్ మాదిరే ఆయన తమ్ముళ్లు కూడా అనేక వివాదాలను ఎదుర్కోవడం జరిగింది. 

తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముళ్లు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధలను వీరు ఉల్లఘించడంతో బి ఎమ్ సి అధికారులు వీరిద్దరిపై పిర్యాదు చేశారు. డిసెంబర్ 25న దుబాయ్ నుండి ముంబై వచ్చిన అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ క్వారంటైన్ గడపాల్సి వుంది. దీని కోసం అధికారులు ఏర్పాటు చేసిన హోటల్ లో వీరిద్దరూ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉండాలి. 

అయితే అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ నేరుగా ఇంటికి వెళ్లినట్లు బీఎంసీ అధికారులు తెలియజేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన కారణంగా వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసు పెట్టడం జరిగింది. దీనిపై ముంబై పోలీసులు విచారిస్తూ ఉండగా... ఎయిర్ పోర్ట్ లో తమకు కోవిడ్ పరీక్షలు చేశారని, నెగిటివ్ అని తేలిన నేపథ్యంలో నేరుగా ఇంటికి వెళ్లినట్లు ఈ స్టార్ బ్రదర్స్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.