‘మూతోన్‌’ తెలుగు సినిమా రివ్యూ

కొన్ని సినిమాలు, పాత్రలు చూసిన తర్వాత వెంబడిస్తాయి. మనని చాలా డిస్ట్రబ్ చేసేస్తాయి. అవి ఆ పాత్రల రాసిన విధానం కన్నా దాన్ని పోషించిన నటుడు ప్రతిభ ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘మూతన్’. ప్రేమమ్ మూవీతో దేశమంతా క్రేజ్ సంపాదించుకున్న నివిన్ పాలీకు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకేనేమో డబ్బింగ్ కాకుండానే ..  ఆయన నటించిన  ‘‘మూతన్’’   సినిమా కూడా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ప్రతిష్టాత్మకమైన ‘‘న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్’’ లో ‘‘మూతన్’’ సినిమా ఏకంగా మూడు అవార్డులు గెలుచుకుంది. అక్బర్ పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ అందించిన నివిన్ పాలీ కి ఉత్తమ నటుడిగా అవార్డు రాగా, బెస్ట్ చైల్డ్ అర్టిస్టుగా సంజనా దీపు, బెస్ట్ మూవీ గా ‘‘మూతన్’’, ఇలా మూడు అవార్డులను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ అవార్డు అందుకున్న మొదటి మళయాల నటుడు  నివిన్ పాలీ  కావడం విశేషం. ఇంతటి గొప్ప పేరు కలిగిన ఈ సినిమా తెలుగులో ఆహా వారు డబ్బింగ్ చేసి వదిలారు. ఈ సినమా అసలు ఎందుకు అంతకు అంత గొప్పదైంది, కథ ఏమిటి..మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Moothon telugu movie review JSP

 కథేంటి
లక్ష ద్వీప్ లో ముల్ల అనే 14 ఏళ్ల టీనేజర్ కి తప్పిపోయిన అన్నయ్య అక్బర్ అంటే ప్రాణం. కాని ఆ అన్నయ్య ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ముంబై వెళ్లిపోయాడు.  ఓ జాలరి దగ్గర పెరుగుతున్న ముల్ల తన అన్నయ్య బట్టలు వేసుకుంటూ ,అతని మ్యానరిజమ్స్ అనుకరిస్తూ ఉంటాడు. దాంతో అందరూ ముల్లని ఏడిపిస్తూంటారు. ఈ క్రమంలో స్కూల్ కు కూడా మానేస్తాడు. ఓ రోజు ఇక ఇక్కడ అనవసరం అని ముంబై ప్రయాణం కడతాడు. అక్కడ అతను హిందీ రాకపోవటంతో ముంబై పోలీస్ లకు దొరుకుతాడు. వాళ్లు ఓ అనాధాశ్రమంలో పెడతారు. అక్కడ పరిచయం అయిన రాజు అనే కుర్రాడు చెప్పిన సలహాతో అక్కడ నుంచి బయిటపడ్తాడు.ఆ తర్వాత రాజు తల్లి అయిన రోసి అనే సెక్స్ వర్కర్ దగ్గరకు వెళ్తాడు. ఆమె ఇతన్ని ఓ టీకొట్లో పనికిపెడుతుంది. ఇలా జీవితం చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతున్న సమయంలో ..ముంబైలో ఓ భాయ్...ముల్లను కిడ్నాప్ చేస్తాడు. అతను పిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేసే వ్యాపారం,డ్రగ్స్ బిజినెస్ చేస్తూంటాడు. అయితే ఇక్కడే ఓ
ట్విస్ట్..ఆ భాయ్ మరెవరో కాదు...ముల్లా ఎవరికోసం అయితే వెతుకుతున్నాడో ఆ అన్నగారే. అయితే ముల్లాకు ఆ విషయం తెలియదు. ఈ లోగా ఓ షాకింగ్ నిజం ముల్లా గురించి బయిటపడుతుంది. అప్పుడు అక్బర్ ఏం చేసాడు. అసలు ముల్లా ఎవరు..ఆడా లేక మొగా, అక్బర్ తన సొంత ప్రాంతం లక్ష ద్వీప్ ఎందుకు వదిలిపోయాడు. ఈ సినిమా శోబిత ధూళిపాళ పాత్ర ఏమిటి  వంటి  విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 


ఎలా ఉంది..
ఇదో పవర్ ఫుల్ స్టోరీ. ప్రత్యేకంగా హీరో అంటూ ఎవరూ ఈ కథలో ఉండరు. అందరూ పాత్రధారులే. జెండర్ ఐడింటిటీ, లవ్ ని దర్శకురాలు అద్బుతంగా ప్రెజెంట్ చేసింది. కామాటిపుర రెడ్ లైట్ ఏరియా సీన్స్ ని ఎంతవరకూ ఉపయోగించుకోవాలో సినిమాకు అంతవరకే వాడటం జరిగింది. అంతేకానీ ఏవేవో చూపించి క్యాష్ చేసుకోదలుచుకోలేదు. నివిన్ పాలీ ని ప్రేమమ్ లో చూసిన కుర్రాడేనా ఈ డ్రగ్ లార్డ్ అనిపిస్తుంది. అంత రగ్గడ్ గా, దుర్మార్గుడుగా కనిపించాడు. అయితే అదే సమయంలో ఎమోషన్ ని అండర్ ప్లే చేసాడు. కొన్ని హోమో  సెక్సవల్ సీన్స్ ఉన్నా..వాటిని నిజాయితీ గా ప్రెజెంట్ చేయటంతో మనకు జుగుప్స కలిగించదు. మరో కీలకమైన పాత్ర అమీర్ గా చేసిన రోషన్ మాచ్యూ అయితే కేవలం కళ్ళతోనే సినిమాని నడిపించేసాడు. నివిన్ పాలీ, రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు డైరక్టర్ కు విజువల్ ప్రెజెంటేషన్  మీద గ్రిప్ ని తెలియచేస్తుంది. 
  
టెక్నికల్ గా ...

అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుడే ప్రొడ్యూసర్ అయ్యినప్పుడు టెక్నికల్ వ్యాల్యూస్ లోటేముంటుంది. ఈ సినిమాలో కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పోటీపడుతూంటాయి. అలాగే ఆర్ట్ డిపార్టమెంట్, ఎడిటింగ్ సినిమాకు కీలకంగా నిలుస్తాయి. ఒక్క ఎగస్ట్రా సీన్ కూడా ఉన్నట్లు అనిపించదు. అయితే అక్కడక్కడా స్లో అయినట్లు ఉండటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. 

ఫైనల్ థాట్

ఆహాలో వచ్చే 100 శాతం తెలుగు కంటెంట్ కన్నాఅందులో వచ్చే మళయాళ సినిమాలే వెయ్యి శాతం బాగుంటున్నాయి.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:3

నటీనటులు:
నవీన్‌ పౌలీ, శశాంక్‌ అరోరా, సంజనా దీపు, రోషన్‌ మాథ్యు, శోభితా ధూళిపాళ, మెలిస్సా రాజు థామస్‌,
సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి, 
మ్యూజిక్‌: సాగర్‌ దేశాయ్‌
  స్క్రీన్‌ ప్లే: గీతూ మోహన్‌దాస్‌, అనురాగ్‌కశ్యప్‌,శ్రీజా శ్రీధరన్‌
 నిర్మాత: అనురాగ్‌ కశ్యప్‌, 
ఎడిటర్‌: బి.అజిత్‌ కుమార్
దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్‌
స్ట్రీమింగ్ ఎక్కడ: ఆహా ఓటీటి
విడుదల తేదీ 16-10-2020.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios