ప్రముఖ వార్తా ప్రసార సంస్థ ఇండియా టుడే నిర్వహించిన కాన్ క్లేవ్ లో "ఫాదర్ టు డాటర్: డిఎన్ఎ ఆఫ్ యాక్టింగ్" అనే పేరుతో జరిగిన సెషన్‌లో... విశ్వనట సార్వభౌమ మంచు మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అని ఆయన అన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిందని మోహన్ బాబు అన్నారు.

 

పొలిటీషియన్ అంటే ఎన్టీఆర్ అని, లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదని తన స్నేహితుడు, తనకు అన్న అయిన ఎన్టీ రామారావు చాలా మంచి వ్యక్తి అని, లంచం ఏమిటో కూడా ఎన్టీఆర్‌కు తెలియదని మోహన్ బాబు అన్నారు. తనను ఎన్టీఆర్ రాజ్యసభకు పంపించారని, ఎటువంటి మచ్చ లేకుండా తన పదవీ కాలాన్ని పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

 

ఈ చర్చలో.. 95 శాతం మంది రాజకీయ నాయకులు రాస్కెల్స్ అని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తున్నారని అంటూ వాటిని నిలబెట్టుకునే వారెవరు అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు మాట నిలబెట్టుకుని ఉంటే భారతదేశం ఇంకా మంచి స్థానంలో ఉండేదని ఆయన అన్నారు.

 

తన తండ్రి మోహన్ బాబు కింగ్లా కాకుండా కింగ్ మేకర్‌లా ఉండాలని కోరుకున్నారని మంచు లక్ష్మి చెప్పారు. నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మోహన్ బాబు స్వభావమని ఆమె అన్నారు.  తన తండ్రి కింగ్ మేకర్ అని, సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లినవారి తరఫున ప్రచారం చేసి వారిని గెలిపించారని ఆమె చెప్పారు. ఈ సమావేశానికి వచ్చినవారిలో చాలా మంది తన తండ్రికి తెలియదని, అయినా కూడా భయపడకుండా తన మనసులో ఉన్నది వెల్లడించడానికి సంకోచించలేదని ఆమె గుర్తు చేశారు.