'మిడిల్ క్లాస్ మెలొడీస్' రివ్యూ
సరిగ్గా చెప్పాలే కానీ మిడిల్ క్లాస్ మహారాజుల కథలు ఎప్పుడూ బాగానే ఉంటాయి. అయితే వాటిని సంసారం ఒక చదరంగం వంటి స్దాయిలో తెరకెక్కించగలిగే దర్శకులే కనపడటం లేదు. అదే సమయంలో ఆ కథలకు న్యాయం చేసే సామాన్య హీరోలు కానరావటం లేదు. రెండో సినిమాకే రామ్ చరణ్ నో, మహేష్ బాబునో ప్రక్కన తోసేయాలనే తాపత్రయంతో కమర్షియల్ సినిమాలు చేసేస్తున్నారు. అయితే ఆనంద్ దేవరకొండ కాస్తంత డిఫరెంట్ గానే కథలు ఎంపిక చేసుకుంటున్నాడు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ,కథనంతో సాగేలా రెండో సినిమానూ ప్లాన్ చేసుకున్నారు. మధ్యతరగతి మందహాసాలను మనస్సుని తట్టే విధంగా చేప్పారనిపించేలా ట్రైలర్ వదిలారు. నిజంగానే ఈ సినిమా మిడిల్ క్లాస్ ని ఆకట్టుకుంటుందా...మిడిల్ డ్రాప్ అయ్యిపోతుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
రాఘవ (ఆనంద్ దేవరకొండ)కి హోటల్ బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలనేది జీవితాశయం. చిన్నప్పటి తన తండ్రి (గోపరాజు రమణ) సొంతూరు కొలకలూరులో నడిపే హోటల్ లో సాయింగా ఉంటూండటం అనువాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అతనికి బొంబై చెట్నీ చేయటం అంటే చాలా ఇష్టం. దాన్ని తనంత బాగా చేసేవారు లేరని పెద్ద నమ్మకం. ఆ నమ్మకం తోటే తన దగ్గర టౌన్ గుంటూరులో హోటల్ పెట్టి క్లిక్ చేయాలనుకుంటాడు. హోటల్ పెట్టడం అంటే మాటలు కాదు. పెట్టుబడి కావాలి. షాప్ అడ్వాన్స్ లు ఇవ్వాలి. హోటల్ లో పనిచేసే మనుష్యులకు జీతాలు ఇవ్వాలి. అందుకోసం కుటుంబాన్ని ఒప్పిస్తాడు. హోటల్ పెడతాడు. ఫైమస్ బొంబై చెట్నీ ప్రత్యేకత అని బోర్డ్ కూడా పెడతాడు. అయితే ఇంట్లో వాళ్లను ఒప్పించి పెట్టుబడి పెట్టించగలిగిన రాఘవ...జనాలను తన రుచులతో మెప్పించగలుగుతాడా. హోటల్ బిజినెస్ లో ఎంతో పోటీ ఉన్న గుంటూరులో పాగా వేయగలుగుతాడా. సంధ్య (వర్ష బొల్లమ్మ) తో అతని ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా..దానికి అతని హోటల్ బిజినెస్ కు ఉన్న లింకేంటి, అలాగే ఈ సినిమాలో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ఏ పాత్రలో కనిపించాడు... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది..
ప్రారంభంలో ఓ గృహప్రవేశం సీన్ తో కొత్తగా అనిపిస్తూ మొదలైన ఈ సినిమా మెల్లి మెల్లిగా పాతపడటం మొదలవుతుంది. పాత్రల పరిచయం దాకా చాలా స్పీడాగా చేసిన దర్శకుడు ఆ తర్వాత అసలైన కథలోకి మాత్రం అదే స్పీడుని మెయింటైన్ చేస్తూ వెళ్లలేకపోయాడు. ప్రధానమైన కాంప్లిక్ట్ అయిన ..హోటల్ పెట్టి సక్సెస్ అవటానికి తోడుగా మరిన్ని సబ్ ప్లాట్స్ అల్లుకున్నారు. వాటిలో హీరో లవ్ ట్రాక్, హీరో ప్రెండ్ లవ్ ట్రాక్ ..మెయిన్ ప్లాట్ తో సమానంగా నడుస్తూంటాయి. దాంతో అసలుకథ అయిన హోటల్ పెట్టే కార్యక్రమం మరుగున పడిపోతుంది. మిగతా ట్రాక్ లు నడుస్తున్నా మన దృష్టి మొత్తం హీరో..హోటల్ ఎప్పుడు పెడతాడు...సక్సెస్ అవుతాడా లేదనే విషయం పైనే ఉంటుంది. ఆ ఒక్కటి తప్ప మిగతావన్ని జరగుతూంటాయి. దాంతో ఫస్టాఫ్ లో ఏమీ జరిగినట్లు ఉండదు. ఏదీ మన మైండ్ లో రిజిస్టర్ కాదు. అక్కడక్కడా కామెడీ సీన్స్ నవ్వించినా ఫలితం ఉండదు.
సెకండాఫ్ కు వచ్చేసరికి కాస్తంత అసలు కథలోకి వచ్చారు. హోటల్ పెట్టాక వచ్చే ఇబ్బందులు ఉంటాయి..అయితే వాటిని ఎలా అధిగమించాడు అనేది ఆసక్తికరంగా ఉండదు. బొంబై చెట్ని రుచించలేదని ఓ ఫార్ములా కనుక్కున్నట్లుగా దానిపై ప్రయోగాలు చేయటం, చివరకు న్యూటన్ యాపిల్ కాయను చూసి ఆలోచన వచ్చినట్లు ..అతనికి ఓ మామిడికాయన చూసి ఐడియా రావటం చూస్తూంటే కన్విన్సింగ్ గా అనిపించదు. ముఖ్యంగా ఇలాంటి కథలను నాచురల్ గా చెప్పాలనుకున్నప్పుడు స్టీరియో టైప్ క్యారక్టర్స్ తీసుకోకూడదు. అలా చేయటం వల్ల పంచ్ కొరవడింది. కథలో కాంప్లిక్ట్ సరిగ్గా లేకపోవటంతో డ్రామా, డెప్త్ రెండూ మిస్సయ్యాయి. ఇక లవ్ స్టోరీ కూడా సోసోగా ఉంది. హీరో ఫ్రెండు లవ్ స్టోరీని నడిపినంత ఇంట్రస్ట్ గా కూడా హీరో లవ్ స్టోరీ డిజైన్ చేయకపోవటం ఆశ్చర్యం.
నటీనటులు
ఈ సినిమా ఆనంద్ దేవరకొండ కు రెండో సినిమా. మాట్లాడుతూంటే తన అన్న విజయ్ దేవరకొండ గుర్తుకు వస్తున్నాడు. అయితే మొదట సినిమాకన్నా నటనలో చాలా మెరుగు. మధ్యతరగితి కుర్రాడుగా ఫెరఫెక్ట్ సెట్ అయ్యాడు. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ చాలా నాచురల్ గా చేసుకుంటూ పోయింది. అలాగే తండ్రిగా వేసిన గోపరాజు రమణ ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. సినిమాలో గుర్తుండిపోయే పాత్ర ఇది. హీరో స్నేహితుడు గోపాల్ గా చైతన్య గరికపాటి ప్రెజన్స్ బాగుంది.
దర్శకత్వం...మిగతా విభాగాలు
ఈ సినిమా దర్శకుడు తొలి చిత్రమైనా అనుభవం ఉన్న డైరక్టర్ లాగ ఏ తడబాటు లేకుండా చేసారు. స్క్రిప్టే అతని దర్శకత్వానికి సరిగ్గా సహకరించలేకపోయారని చెప్పాలి. మొదటగా వచ్చే గృహప్రవేశం వంటి సీన్స్ కొన్ని అక్కడక్కడా దర్శకుడులోని స్పార్క్ ని,సెన్సాఫ్ హ్యూమర్ ని పట్టిస్తాయి. అన్ని డిపార్టమెంట్స్ నుంచి మంచి అవుట్ పుట్ నే తీసుకున్నారు. అదే సమయంలో డైలాగులు చాలా ఫ్రెష్ గా బాగున్నాయి. కాకపోతే కొంచెం బూతులు వాడకం తగ్గిస్తే బాగుండేది. ఓటిటి అందులోనూ మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటే ఫ్యామిలీలు కలిసి చూస్తారనే విషయం గుర్తుపెట్టుకోలేదు. ఇక ఆర్ట్ వర్క్ ఈ సినిమాలో మేజర్ షేర్. అది బాగుంది. స్వీకార్ అగస్తి పాటలు.. విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. రెండూ సినిమాకు ప్లస్ అయ్యాయి. సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం కూడా స్పెషల్ గా అనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
బొంబై చెట్నీ ఫార్ములా ఫెరఫెక్ట్ గా కుదరలేదు
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
తెర వెనక..ముందు
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, ప్రేమ్ సాగర్, ప్రభావతి వర్మ తదితరులు.
సంగీతం: స్వీకార్ అగస్తీ, ఆర్‌హెచ్ విక్రమ్
కెమెరా: సన్నీ కురపాటి
ఆర్ట్: వివేక్ అన్నామళై
ఎడిటర్: రవితేజ గిరజాల
స్క్రీన్ ప్లే: జనార్దన్ పసుమర్తి, వినోద్ అనంతోజు
మాటలు, కథ, కథనం: జనార్దన్ పసుమర్తి
దర్శకత్వం : వినోద్ అనంతోజు
నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్
విడుదల: 20, నవంబర్ 2020
స్టీమింగ్ ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్