త్రివిక్రమ్‌ ఇప్పుడు వెండితెరపై మాటలతో మాయ చేయడమే కాదు, కాంబినేషన్‌ లెక్కలు మార్చేస్తున్నారు. ఊహించని కాంబినేషన్లని తెరపైకి తీసుకొస్తున్నారు.

త్రివిక్రమ్‌(Trivikram) మాటలతో మాయ చేస్తున్నారు. వెండితెరపై ఆయన చెప్పే ఒక్కో మాట ఆడియెన్స్ హృదయాల్లో గుచ్చుకుంటాయి. మెదళ్లలో నాటుకుపోతాయి. ఆహా, హోహో అనే పండ్‌ డైలాగ్‌లుండవు, సింపుల్‌గా, స్టయిట్‌గా స్వీట్‌గా చెప్పే ఒక్క చిన్న డైలాగే చాలు అది ఎన్నో రోజులు గుర్తిండిపోవడానికి, థియేటర్లలో కనక వర్షం కురిపించడానికి అన్నట్టుగా ఉంటుంది ఆయన డైలాగుల్లో ఉన్న పవర్‌.

అయితే ఇప్పుడు ఆయన వెండితెరపై మాటలతో మాయ చేయడమే కాదు, కాంబినేషన్‌ లెక్కలు మార్చేస్తున్నారు. ఊహించని కాంబినేషన్లని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎక్కువగా మహేష్‌, పవన్‌, అల్లు అర్జున్‌లతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్‌ దాన్ని బ్రేక్‌ చేసి ఎన్టీఆర్‌తో `అరవింద సమేత` చేసి హిట్‌ కొట్టాడు. మరోసారి ఎన్టీఆర్‌తో చేయాల్సి ఉండగా, అది కాదని మళ్లీ మహేష్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. 

నెక్ట్స్ మరో కాంబినేషన్‌ మార్చబోతున్నారట త్రివిక్రమ్‌. మెగాస్టార్‌(Megastar)తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. `ఖైదీ నెంబర్‌ 150` తర్వాత చిరంజీవి(Chiranjeevi)కి సరైన హిట్లు లేవు. ప్రస్తుతం చేస్తున్న సినిమాల ఫలితాలు ఊహించలేని ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న వాటిలో `గాఢ్‌ఫాదర్‌` రీమేక్‌. దాన్ని తెలుగు ఆడియెన్స్ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో తెలియని పరిస్థితి. ఆ తర్వాత `భోళా శంకర్‌` కూడా రీమేకే. ఆ సినిమాపై ముందు నుంచే అనుమానాలున్నాయి. ఇక బాబీతో చేస్తున్న `మెగా 154`పైనే ఆశలున్నాయి. 

ఈ నేపథ్యంలో చిరంజీవి కచ్చితంగా, అర్జెంట్‌గా ఓ హిట్‌ కావాలి. అందుకు త్రివిక్రమ్‌ అయితే బెటర్‌ అని భావిస్తున్నారట చిరు. త్రివిక్రమ్‌తో సినిమా చేస్తే వింటేజ్ చిరుని అభిమానులకి గుర్తుకి తెచ్చే అవకాశం ఉంటుందని, అందుకే త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి మెగాస్టార్ రెడీ అయ్యారట. చిరులోని కామెడీ యాంగిల్‌ని ఫుల్ లెంగ్త్‌లో చూపిస్తూ, అవుట్ అండ్ అవుట్ కామెడీ పాత్రలో చిరుని త్రివిక్రమ్ చూపించనున్నారట. గతంలో చిరంజీవి చేసిన `జై చిరంజీవ` మూవీకి త్రివిక్రమ్‌ మాటలు రాశారు. ఇప్పుడు డైరెక్ట్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితే మాత్రం క్లాసీగా బాక్సాఫీసుని షేక్‌ చేయడం ఖాయం. 

ఈ సినిమా కోసం వెంకీ కుడుముల ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టు సమాచారం. అదే సమయంలో `భోళా శంకర్‌` సినిమాని కూడా పక్కన పెట్టారని సమాచారం. `గాఢ్‌ ఫాదర్‌`, `మెగా 154` తర్వాత ఆ సినిమా చేయాలనుకుంటున్నారట. అనంతరం త్రివిక్రమ్‌ సినిమా ఉండే అవకాశాలున్నాయని తెలుస్తుంది. దీంతో `భోళా శంకర్‌`, వెంకీ కుడుముల సినిమాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని భోగట్టా. వీటన్నింటికి `ఆచార్య` ఫలితమే అని వేరే చెప్పక్కర్లేదు.