మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడందుకున్నాడు. ఖైదీ నంబర్ 150 సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్ అందుకున్న చిరు తరువాత పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డిలో నటించాడు. ఈ రెండు సినిమాల తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాత చేయబోయే సినిమాలను వరుసగా లైన్‌లో పెడుతున్నాడు.

మలయాళ సూపర్‌ హిట్ సినిమా లూసీఫర్‌ను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఓకె చెప్పాడు చిరు. ఈ సినిమా తరువాత మరోసారి పాన్‌ ఇండియా లెవల్‌లో ఓ భారీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. సౌత్ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. శంకర్‌ తొలి సినిమా జెంటిల్‌మెన్ రిలీజ్‌ అయిన దగ్గర నుంచి శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నా చిరు.

జెంటిల్‌మెన్‌ సినిమాను హిందీలో చిరు రీమేక్‌ చేశాడు కూడా. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌ ఇంత వరకు సెట్ అవ్వలేదు. దీంతో ఈ సారి గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం శంకర్‌.. కమల్‌ హాసన్‌ హీరోగా భారతీయుడు 2 సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. సెట్‌లో ప్రమాదం జరగటంతో  షూటింగ్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చిరు, శంకర్‌ల సినిమాలు పూర్తయిన తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.