మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే వైష్ణవ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. లాక్ డౌన్‌ కనుక వచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ లాక్‌ డౌన్‌ రావటంతో సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి.

కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకుడు. బుచ్చిబాబు గతంలో సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అందుకే సుకుమార్ నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పాటకు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. ఇన్నాళ్లు ఈ సినిమాను లాక్‌ డౌన్‌ తరువాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్‌ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కనీసం మరో రెండు మూడు నెలలైన థియేటర్లు మూతపడే ఉంటాయని సినిటోగ్రఫి మంత్రి ప్రకటించటంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. అన్ని రోజులు ఆలస్యం చేయటం కన్నా ఇప్పుడే ఓటీటీ ద్వారా సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌ లో ఉప్పెన కూడా చేరిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా ఉప్పెన కూడా ఓటీటీలో రిలీజ్ కావటం దాదాపు కన్ఫమ్ అన్న ప్రచారం జరుగుతోంది.