సినీ రంగాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. లెజెండరీ స్టార్స్ మరణాలు, యువ నటుల ఆత్మహత్యలు ఇండస్ట్రీ వర్గాలను కలవరపెడుతున్నాయి. బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నుంచి ఇంకా కోలుకోకముందే మరో యువ నటుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరాఠీ సినీ నటుడు అశుతోష్‌ భక్రే బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన వయసు 32 సంవత్సరాలు.

మరాఠ్వాడా, నాంథేడ్ ప్రాంతంలోని తన నివాసంలో అశుతోష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తను చనిపోవడానికి ముందు ఓ వ్యక్తి అసులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడో వివరిస్తూ తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు అశుతోష్. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 2013లో భకార్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు అశుతోష్.

2016లో ప్రముఖ మరాఠీ టీవీ నటి మయూరీ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నాడు అశుతోష్. గతంలో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఓ వ్యక్తి అంతటి తీవ్ర నిర్ణయాలు ఎందుకు తీసుకుంటాడో వివరిస్తూ సుశాంత్‌కు మద్దతుగా ఓ లెటర్‌ను పోస్ట్ చేసింది అశుతోష్‌ భార్య మయూరి.