వెబ్ సీరిస్ ల కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారా అంటే...అవుననే సమాధానం ఈ వెబ్ సీరిస్ విషయంలో వినిపించింది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవటం, సెకండ్ సీజన్ లో సమంత కీ రోల్ చేయటం, ట్రైలరో తో వివాదాలు రగిలించటంతో ఈ సీరిస్ పై అందరి దృష్టీ పడింది. ముఖ్యంగా  #shameonyouSamantha  అనే హ్యాష్ ట్యాగ్  ఆమె అభిమానులను అయితే కంగారుపెట్టింది. అయితే సమంత కూల్ గానే ఉంది. ఈ నేపధ్యంలో వచ్చిన  ‘ఫ్యామిలీమ్యాన్‌2’ ఎలా ఉంది. శ్రీకాంత్‌ తివారిగా మనోజ్‌బాజ్‌పాయ్‌ ఈ సారి ఏం కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.   సరికొత్త పాత్రలో కనిపిస్తున్న సమంత అసలు క్యారక్టర్ ఏమిటి. మరి మొదటి సీజన్‌ను మించి రెండో సీజన్‌ అలరిస్తుందా? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చూద్దాం. 

కథేంటి

ఎల్ టీటీఈ ఛీఫ్ భాస్కరన్ (మైమ్ గోపి) ని అంతం చేసేందుకు శ్రీలంక గవర్నమెంట్  మన దేశ  ప్రథాని సాయిం  కోరుతుంది.కానీ భాస్కరన్  తప్పించుకుంటాడు. దాంతో అతని తమ్ముడు (సుబ్బు)ని  అప్పగించాలని శ్రీలంక ...భారత్  పై ఒత్తిడి తెస్తుంది. కానీ భాస్కరన్ తమ్ముడుని కోర్టులో  ప్రవేశపెట్టే సమయంలో పాకిస్దాన్ మేజర్ వేసిన స్కెచ్  తో బాంబ్ బ్లాస్ట్ లో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. దాంతో భారత్ పై పగ పెంచుకున్న   భాస్కరన్...ప్రధానిని  లేపేయాలని ప్లాన్  చేస్తాడు.

మరోప్రక్క శ్రీకాంత్ తివారి(మనోజ్ బాజ్ పేయి)  తన అండర్ కవర్ జాబ్ ని  వదిలేసి,ఐటీ ఫర్మ్ లో పని చేస్తూంటాడు.భార్య సుచిత్ర (ప్రియమణికి) ఇష్టమైనట్టు ఉండేలా బిహేవ్ చేస్తూ ఆ ప్రాసెస్ లో నలిగిపోతూంటాడు. ఇంట్లో పెళ్లాంతో గొడవలు,పిల్లలతో ఎడ్జెస్ట్ కాలేనితనం  అతనికి చాలా  విసుగ్గా  మారతాయి.ఈలోగా అతనికి ప్రధానిపై దాడి  జరగబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఐటీ జాబ్‌ వదిలి మళ్లీ టీంలో జాయిన్ అవుతాడు.

ఈ కథలో కీలకమైన పాత్ర రాజీ(సమంత) విషయానికి వస్తే...ఆమె ఓ స్పిన్నింగ్ మిల్‌లో పని చేస్తుంటుంది. అక్కడ ఓనర్ వేధింపులు, బస్సులో  టీజింగ్‌లను ఎంతో ఓపికతో భరిస్తుంటుంది. చిర్రెత్తిన ఆమె ఓ రోజు ఓ టీజ్ చేసావాడిని దారుణంగా హతమారుస్తుంది. ఇదే సమయంలో రాజీకి తమ లీడర్ నుంచి కాల్ వస్తుంది. అసలు ఎవరీ రాజీ...ఆమె అంత వైల్డ్ ఎందుకు బిహేవ్ చేస్తోంది. ఆమె టార్గెట్ ఏమిటి..ఆమెకు ప్రధాని హత్య ప్లాన్ కు లింకేంటి వంటి విషయాలు తెలియాలంటే సీజన్ 2 చూడాల్సిందే.  
  
విశ్లేషణ

రాజీవ్ గాంధీ హత్య విషయాలపై కొద్దిగా అవగాహన ఉన్న వాళ్లకి ఎవరైనా ఈ సీజన్ లో పాత్రలపై క్లారిటీ వచ్చేస్తుంది. రాజీ పాత్ర ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలిసిపోతుంది. ఈ సీరిస్ లో సమంత పాత్రను చాలా జాగ్రత్తగా డీల్ చేసారు. వివాదాలు వస్తాయని ముందే ఊహించారేమో..ఎక్కడా అతికిపోలేదు. శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికి గురైన తమిళుల ప్రతినిధిగా సమంతాని ప్రవేశపెట్టారు. ఆ పాత్రచూస్తే సానుభూతి ఓ వర్గానికి ఖచ్చితంగా కలుగుతుంది. దాంతో ఆమె సమంత పాత్రపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తారు. తమిళనాడు, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఆమె నటించలేదని అర్దం చేసుకుంటారు. సమంత కూడా ఎందుకు అంత దైర్యంగా ఉందో సీరిస్ చూసాక అర్దమవుతుంది. ప్రెడిక్టబుల్ గా అనిపించినా ఈ సీరిస్ లో డ్రామా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా బాగానే థ్రిల్ చేస్తుంది.. తొమ్మిది ఎపిసోడ్స్ కాస్త పెద్దవిగా అనిపిస్తాయి. మొదట నాలుగు ఎపిసోడ్స్ లో ఏమీ జరిగినట్లు అనిపించదు. ఎందుకంటే సమంత పాత్రను బాగా దాచి పెట్టారు. ఆమె ఎవరనేది పూర్తిగా రివీల్ అయ్యేదాకా మనకు పెద్దగా ఇంట్రస్ట్ కలగదు. ముఖ్యంగా చివరి నాలుగు ఎపిసోడ్స్ రేసీగా యాక్షన్ తో పరుగెడతాయి. అయితే ఐఎస్ ఐ కు, ఎల్ టీటీఈకు ఊహాత్మక లింక్ పెట్టడం మాత్రం చాలా మంది తమిళలను బాధిస్తుంది. ఏదైమైనా ఇలాంటి సీరిస్ ల ద్వారా తెలుగులో సీరియస్ వెబ్ సీరియస్ ప్రేక్షకులను పుట్టించవచ్చు. పెద్ద  తెరమీదకన్నా ఓటీటి తెరపైనే టెర్రరిస్ట్ కథలు బాగా వర్కవుట్ అవుతున్నాయి అని ప్రూవ్ అయ్యింది.

 సమంత ప్లస్ అయ్యిందా

ఖచ్చితంగా ఈ సీరిస్ కు సమంతను ఎంచుకోవటం ప్లస్ అనే చెప్పాలి. ఆమె పాత్రలో మరొకరని ఊహించటం కష్టం. అంతలా పాత్రలోకి వెళ్లిపోయింది. సమంత చేసిన రాజీ పాత్ర సీరిస్ అంతా సీరియస్ గానే ఉంటటుంది. సానుభూతిని కోరుకుంటూ,,తన లక్ష్యం మీదే ఆమె దృష్టి ఉంటుంది. ఓ టఫ్ ఫైటర్ గా, మిలిటెంట్ గా సమంత..నమ్మశక్యంగా నమ్మించింది.  అయితే సీరిస్ చాలా చోట్ల రిపీట్ అయ్యినట్లు,కథ ఆగినట్లు కనిపిస్తుంది. 

టెక్నికల్ గా...
మొత్తం చెన్నై షూట్ చేసుకున్న ఈ సీరిస్ టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసారు. నేపథ్య సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ ఒకదానికొకటి పోటీ పడ్డాయి. రొమాన్స్ ఉన్నా కథలో భాగంగానే తప్ప విడిగా అనిపించదు. నిర్మాణవిలువలు బాగున్నాయి. శ్రీకాంత్ తివారి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
 
 ఫైనల్ థాట్

కోల్‌కతా కేంద్రంగా చైనావాళ్లు కరోనావైరస్ వ్యాప్తి చేస్తున్నారంటూ మూడో సీజన్‌కు లీడ్ ఇవ్వటం..పట్టించుకుంటే మరో వివాదమే..కాకపోతే దేశాల మధ్య. 

Rating:3

--సూర్య ప్రకాష్ జోశ్యుల