సినీ రంగాన్ని విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లెజెండరీ నటులు ఇర్పాన్‌ ఖాన్‌, రిషీ కపూర్‌లు మృతి చెందటంతో ఇండస్ట్రీ అంతా షాక్‌ అయ్యింది. అయితే ఈ బాధ నుంచి ఇండస్ట్రీ ఇంకా బయట పడక ముందే వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మలయాళ యువ నటుడు కారు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాదం ఇంకా కళ్ల ముందు కలవర పెడుతుండగానే దర్శకుడు జిబిత్ జార్జ్‌ ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.

ఇంత చిన్న వయసులోనే జిబిత్‌ మరణించటంతో ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జిబిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం కొజిప్పోర్‌ మార్చి 6న రిలీజ్ అయ్యింది. అయితే కేరళలో మార్చి 11 నుంచి లాక్‌ డౌన్‌ విధించటంతో ఆ సినిమా ఆశించి స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో లాక్ డౌన్‌ ఎత్తి వేసిన తరువాత సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ లోగానే ఈ దుర్ఘటన జరిగింది.

ప్రస్తుతం కొచ్చిలో నివసిస్తున్న జిబిత్‌కు శనివారం సాయంత్రం తీవ్ర గుండె పోటు వచ్చింది. వెంటనే ఆయను దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా కాపాడలేకపోయారు. ఆయన మృతి పట్ల మలయాళ సినీ పరిశ్రమ సంతాపం తెలియజేసింది. ఇప్పటికే లాక్ డౌన్‌ కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న సినీ పరిశ్రమను ఇలా వరుస వివావాదాలు వెంటాడుతుండటంపై ఇండస్ట్రీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.