హీరోలు ఒక్కొక్కరూ కదులుతున్నారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటం..జాగ్రత్తలు తీసుకుందాం..దాన్ని తరిమికొడదాం అంటూ పిలుపు ఇస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి తాజా ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్‌లో హీరోలుగా నటిస్తోన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల తన అభిమానులతో సామాన్య ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన ఆరు సూత్రాలను పాటిస్తే కరోనా బారి నుంచి ప్రజలు తమను తాము రక్షించుకోవచ్చని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తాజాగా వీళ్ల బాటలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు.. కరోనా వైరస్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ట్వీట్ చేసారు. కరోనా వైరస్ నేపథ్యంలో అందరు సామాజికంగా దూరం పాటించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాదు ప్రజలందరు ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలన్నారు. 

‘కోవిడ్‌ నుంచి తప్పించుకోవడానికి తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాల్సిందే. ఇది కష్ట కాలమే అయినప్పటికీ... మనం దాన్ని ఆచరించి చూపించాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప.. వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటంమంచిది’ అని పేర్కొన్నారు.