హీరో విజయ్ దేవరకొండ వెబ్  మీడియాలో కొందరిపై ఓ రేంజ్ లో విరుచుకు పడిన సంగతి తెలిసిందే. తను ఇంటర్వూ ఇవ్వలేదని తనపై ఇష్టమొచ్చినట్లు గాసిప్స్ రాస్తున్నారు అన్నారు. తను చేస్తున్న వితరణ కార్యక్రమాలపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ...అసలు నన్ను దానం చేయమనడానికి మీరెవరని మండి పడ్డారు. ఫేక్ న్యూస్ వెబ్స్ సైట్స్ ని చదవద్దు అని ప్రజలను రిక్వెస్ట్ చేసారు. కొన్ని వెబ్సైట్లను ఉద్దేశిస్తూ… ‘ఈ నాలుగు వెబ్‌సైట్లు గత నెల రోజులుగా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాయి. విపరీతమైన ఫేక్‌ వార్తలు రాస్తున్నాయి. ‘విజయ్‌ దేవరకొండ ఎక్కడ?, విజయ్‌ దేవరకొండ దాక్కున్నాడా?, విజయ్‌ దేవరకొండ వేదికపైకి రావాలి?..’ అని రాశారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయంలో ఆయనకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు, రవితేజ, హరీష్ శంకర్, రయిచత బివిఎస్ రవి, రానా దగ్గుబాటి ఇలా చాలా మంది విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచారు. మహేష్ బాబు ట్వీట్ చేస్తూ....

https://twitter.com/urstrulyMahesh/status/1257332843073724423

"ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, కృషి, ఓర్పు, తపన, త్యాగాల ఫలితంగా ఇవాళ ప్రజల నుంచి గౌరవం, ప్రేమ పొందగలుగుతున్నాం. అదే సమయంలో ఓ భార్య కోరుకునే మంచి భర్తగా ఉండేందుకు కష్టపడతాం, మా నాన్న సూపర్ హీరో అని పిల్లలు భావించాలని తపించిపోతాం. ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ లా ఉండాలని కోరుకుంటాం. మేం ఇన్నివిధాలుగా కష్టపడుతుంటే, ఎవడో ముక్కూమొహం తెలియనివాడు, డబ్బుకోసం ఏమైనా చేసేవాడు వచ్చి మమ్మల్ని అగౌరవపరుస్తూ, పాఠకులకు అవాస్తవాలు నూరిపోస్తూ, దుష్ప్రచారం సాగిస్తుంటాడు. ఇదంతా కూడా డబ్బు కోసమే!

ఇలాంటివాళ్ల బారి నుంచి తెలుగు సినిమాకు చెందిన ఈ అందమైన పరిశ్రమను కాపాడుకోవాలనుకుంటున్నాను. నా అభిమానులను, నా పిల్లలను ఇలాంటి దురాలోచనలతో కూడిన ప్రపంచం నుంచి రక్షించుకోవాలనుకుంటున్నాను. మాపై ఆధారపడి, మా జీవితాలనే కించపరిచేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ఇలాంటి ఫేక్ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను" అంటూ మహేశ్ బాబు తన లేఖలో ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఫేక్ న్యూస్ ను నిర్మూలించండి, గాసిప్ వెబ్ సైట్లను అంతమొందించండి అంటూ పిలుపునిచ్చారు.