టాలీవుడ్ లో షూటింగ్స్ సందడి మొదలుకానుంది. అందరూ హీరోలు తమ ప్రాజెక్ట్స్ ని మొదలుపెట్టనున్నారు. షూటింగ్ షెడ్యూల్స్, లొకేషన్స్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఐదు నెలలుగా షూటింగ్స్ జరగడం లేదు. ఎదురు చూసినప్పటికీ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టేలా లేదు. దీనితో ధైర్యం చేసి అందరు హీరోలు బరిలో దిగుతున్నారు. ప్రభుత్వాలు సూచించిన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ షూటింగ్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. 

కాగా టాలీవుడ్ కి చెందిన మరో ఇద్దరు టాప్ హీరోలు కూడా షూటింగ్స్ కి సిద్ధం అవుతున్నారు. మహేష్ మరియు అల్లు అర్జున్ త్వరలోనే షూటింగ్స్ మొదలుపెట్టనున్నారు. దర్శకుడు పరుశురామ్ తో మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కి సర్వం సిద్ధమైందని వినికిడి. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప షూటింగ్ కూడా తిరిగి మొదలుకాబోతుంది. చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాలతో పాటు  మహా రాష్ట్రలలో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు. 

కాగా సర్కారు వారి పాట, పుష్ప చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. పుష్ప మూవీ కేరళలో ఓ చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ షెడ్యూల్ నందు అల్లు అర్జున్ పాల్గొనలేదు. ఇక మహేష్ సర్కారు వారి పాట మూవీ షూటింగ్ అసలు మొదలుకాలేదు. ఐతే ఏక కాలంలో  మొదలుకానున్న ఈ రెండు చిత్రాల షూటింగ్స్ దాదాపు ఒకే సమయంలో పూర్తి కావచ్చు. దీనితో మహేష్, బన్నీ మధ్య మరోమారు భీకరపోరు నడిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో మూవీలతో వీరు పోరుకు దిగారు. మరో మారు 2021 లో సమ్మర్ లేదా దసరా సీజన్ కి మహేష్, బన్నీ పోటీపడడం ఖాయం అంటున్నారు.