పాలిటిక్స్ మేడ్ ఈజీ: 'ఎల్‌కేజీ' రివ్యూ
ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తమిళ సూపర్‌హిట్ 'ఎల్.కె.జి'ని 'ఎల్‌కేజీ 2020' పేరుతో అందుబాటులోకి తెచ్చింది. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళ అనువాద చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు ఆర్జే బాలాజీ ఈ సినిమా లో చేసారు.
సెటైర్ చేయటం చాలా కష్టం. ముఖ్యంగా ఎదుటి వాడికి అర్దమయ్యేలా సెటైర్ వెయ్యటం ఇంకా కష్టం. అయితే సెటైర్స్ కొందరు మాస్టర్ డిగ్రీ చేసేస్తారు. వాళ్లు ఏం మాట్లాడినా,మాట్లాడకపోయినా సెటైరే. వ్యంగ్యం విస్తారంగా వారి మాటల్లో,చేతల్లో పండుతూంటుంది. అలాంటి వారిలో
ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ “ఎల్కేజీ”. 2019 ఫిబ్రవరిలో విడుదలైన ఈ తమిళ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సెటైరికల్ మూవీ ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి ఓటిటిలో విడుదల అయ్యింది. ఆ సినిమా ఆల్రెడీ హిట్టే కాబట్టి...కాబట్టి పెద్ద మాట్లాడుకునేదేం లేదు. అయితే తెలుగువాళ్లకు తమిళ పొలిటిల్ సెటైర్ ఎక్కుతుందా లేదా,అలాగే కథ ఏంటి అనే విషయాలు చూద్దాం...
కథ
లంకవరపు కుమార్ గాంధీ అలియాస్ ఎల్‌కేజీ(ఆర్జే బాలాజీ) కి యంగ్ గా ఉండగానే రాజకీయాల్లో ఓ స్దాయికి చేరాలనే కోరిక. ముఖ్యంగా తండ్రి రాజకీయాల్లో ఏమీ సాధించటం లేక ఉపన్యాసకుడుగా మిగిలిపోవటం బాధిస్తూంటుంది. ఈ క్రమంలో చిన్న వయస్సు లోనే రాజకీయ ప్రస్దానం మొదలెడతాడు..వార్డ్ కౌన్సిలర్ అవుతాడు. ప్రతీ వ్యక్తిని ఓ ఓటుగానే చూస్తూ తన వార్డ్ జనాలకు తలలో నాలుకలా మెలుగుతూంటాడు. అయితే అది సంతృప్తినివ్వదు. ఇంకా పైకి ఎదాగాలనే అతని ఆకాంక్షకు అనారోగ్యంతో ఉన్న ముఖ్యమంత్రి మరణం ని తన కెరీర్ కు రాచబాటగా వేసుకోవాలనుకుంటాడు. ఖాళీ అయిన అసెంబ్లీ స్దానం నుంచి పోటీ చేసి ఎమ్మల్యే అవుదామనుకుంటాడు. అందుకోసం ఎలక్షన్ వ్యవహారాలు చూసే ఓ కార్పోరేట్ కంపెనీ ని కన్సల్ట్ చేస్తాడు. ఆ కంపెనీ ఇంఛార్జ్ (ప్రియా ఆనంద్) సలహాలతో డిల్లీ స్దాయిలో పేరు తెచ్చుకుని అధికార పార్టీ దృష్టిలో పడి సీట్ తెచ్చుకుంటాడు. కానీ అసలైన ట్విస్ట్ అక్కడే ఉంటుంది. ఆ అసెంబ్లీ స్దానం కోసం అక్కడ లోకల్ గా బాగా పలుకుబడి ఓ వ్యక్తి రామచంద్రంఎదురుచూస్తున్నాడు. ఎల్కేజీకి సీట్ ఇచ్చారని తెలిసి రెబెల్ గా మారి స్వతంత్ర అభ్యర్దిగా నిలబడతాడు. అలాంటి క్లిష్టమైన పరిస్దితిని ఎల్కేజీ ఎలా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు...చివరకు ఎల్కేజీ గెలిచాడా...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నా ఈ సినిమా ఎంజాయ్ చేయగలుగుతారు. పాత పద్దతిలో ఎలక్షన్స్ జరగటం లేదని, కార్పోరేట్ సంస్దలు సీన్ లోకి వచ్చాయని ఈ సినిమా ద్వారా గుర్తు చేస్తారు. అలాగే సోషల్ మీడియా కూడా ఎలక్షన్స్ ని ఏ స్దాయిలో ప్రభావం చేస్తోందో వివరిస్తాడు. అయితే ఫన్ తో కలిపి చెప్పటంతో చాలా సీన్స్ నవ్విస్తాడు. అయితే సీన్స్ ..విడివిడిగా నవ్వించినా కథగా చూస్తే ఏమీ కనపడదు. దానికి తోడు తమిళ పాత్రలు, సిట్యువేషన్స్ చాలా వరకూ మనకు పరిచయం లేనివే. దాంతో అక్కడ లోకల్ వాళ్లికి ఎక్కినట్లుగా మనకు ఎక్కటం కష్టమే. కామన్ గా అనిపించే విషయాల దగ్గర మాత్రం బాగా నవ్వు వస్తుంది. ఇలా కథ లేకుండా కేవలం సీన్స్ తో నడిచే సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకోవటం ఇబ్బందే. ఆ విషయంలో రైటర్స్ బాగా కష్టపడ్డారు. ఒక వార్డు కౌన్సిలర్ అయిన ఓ కుర్రాడు...ఎమ్మెల్యే స్థాయికి..ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడన్న రాజకీయ ప్రయాణాన్ని వ్యంగ్యంగా రాసుకోవడంలో ఆర్జే బాలాజీ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్ లో తండ్రి సెంటిమెంట్ ని కలిపారు. అయితే సబ్ ప్లాట్ లు లేకుండా సూటిగా పొలిటికల్ సెటైర్ గా సాగటం చాలా మందికి నచ్చే విషయమే కానీ..ఒకే విషయం రిపీట్ అవటం విసుగెత్తిస్తుంది కొన్ని సార్లు. అందులోను ఒకే అలవాటు పడని తమిళ ఫేస్ ని కంటిన్యూగా చూడటం ఇబ్దందే కదా. ఇవన్ని పట్టించుకోకుండా ఉంటే ఇది మంచి సినిమానే.
టెక్నికల్ గా ...
డైలాగులుతో నడిచే ఈ సినిమాకు డబ్బింగ్ బాగా కుదిరింది. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ లోని సూపర్ హిట్ ‘సిత్తరాల సిరపడు’ పాట బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే లియోన్ జేమ్స్ సంగీతం జస్ట్ ఓకే. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ, ఆంథోని ఎడిటింగ్ ఫెరపెక్ట్ అని చెప్పాలి. నటీనటుల్లో ఆర్జే బాలాజీ ఒంటి చేత్తో సినిమాని మోసాడు. ప్రియా ఆనంద్ ఓ కార్పోరేట్ మహిళగా బాగా చేసింది.
ఫైనల్ థాట్
అల్లరి నరేష్ ఫామ్ లో ఉన్న రోజుల్లో చేసిన సినిమాలా ఉంటుంది
----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5
ఎవరెవరు..
నటీనటులు: ఆర్జే బాలాజీ, ప్రియా ఆనంద్, సంపత్, జె.కె.రితేశ్, రామ్ కుమార్ గణేశన్, అనంత్ వైద్యనాథన్ తదితరులు;
సంగీతం: లియోన్ జేమ్స్;
సినిమాటోగ్రఫ్రీ: విధు అయ్యన్న;
ఎడిటింగ్: ఆంథోని;
నిర్మాత: ఇషారి కె.గణేశ్;
రచన: ఆర్జేబాలాజీ అండ్ ఫ్రెండ్స్;
దర్శకత్వం: కె.ఆర్.ప్రభు;
ఓటీటి: ఆహా
విడుదల తేదీ: 25 జూన్,2021
రన్ టైమ్: 124 నిముషాలు