అసలే కరోనాతో ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుండగా మరోవైపు సినీ ప్రముఖుల మరణాలు ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా బాలీవుడ్‌ సినీ ప్రముఖులు మరణించిన వార్తలు అభిమానులను విషాదంలోకి నెట్టేశాయి. తాజాగా సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఓ లెజెండరీ సినిమాటోగ్రాఫర్‌ కన్నన్‌ మృతి చెందిన వార్తతో ఇండస్ట్రీ వర్గాలు విషాదకర వాతావరణం నెలకొంది.

69 ఏళ్ల కన్నన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతం కొంత కాలంగా ఆయన హృదయ సంబంధిత సమస్యతో బాదపడుతున్నారు. ఇటీవల ఆయనకు చికిత్స కూడా జరిగింది. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. శనివారం మధ్యాహ్నం ఆరోగ్యం విషమించటంతో కన్నన్ తుది శ్వాస విడిచారు. కన్నన్‌ తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాలకు కూడా కెమెరామెన్‌గా పనిచేశారు.

ముఖ్యంగా భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తన కెరీర్‌లో 50 సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కన్నన్‌ అందులో 40 సినిమాలో భారతీరాజా దర్శకత్వంలోనే పనిచేయటం విశేషం. తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుకతో పాటు చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆరాధన లాంటి సినిమాలకు ఆయన కెమెరామెన్‌గా పనిచేశాడు.