స్టార్ హీరోల సినిమాలకు కథకు ఎంత ప్రయారిటీ ఉంటుందో అంతకు మించి టైటిల్ కు ఉంటుంది. తమ అభిమాన హీరో చేస్తున్న చిత్రం టైటిల్ ఎంత పరర్ ఫుల్ గా ఉంటే అంత గొప్పగా సినిమా ఉంటుందని అంచనా వేస్తూంటారు ఫ్యాన్స్. ఈ నేపధ్యంలో ఆ తరహా  టైటిల్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. దాంతో తమ అభిమాన హీరో సినిమా ప్రకటన వచ్చిన దగ్గర నుంచీ ఆ చిత్రం టైటిల్ గురించి చర్చ మొదలైపోతుంది. దానికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా సెగ, హవా ఉండటంతో అభిమానులు తమకు తోచిన టైటిల్స్ ను అందంగా డిజైన్ చేసి, ప్రచారం మొదలెట్టేస్తున్నారు. ఇది మేకర్స్ కు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ క్రమంలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేయబోయే చిత్రం టైటిల్ పట్ల కూడా ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి.

అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమాకు రెండు టైటిల్స్ అనుకుంటున్నారట. అందులో ఒకటి ' వీరా' , రెండు 'విరూపాక్ష'.ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తారట. ఈ చిత్రం టైటిల్ని పవన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ప్రకటించడానికి దర్శకుడు క్రిష్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ కి హీరో బర్త్ డేను మించిన రోజు మరొకటి ఉండదని, ప్రేక్షకులలోకి బాగా చొచ్చుకుపోతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు. ఆ రోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారట. 

ఈ చిత్రాన్ని స్వాతంత్ర్యం పూర్వం నాటి కథతో పిరీడ్ మూవీగా నిర్మిస్తున్నారు. పవన్ ఈ చిత్రంలో బందిపోటు పాత్ర చేస్తున్నారు. అలాగే ఆ పాత్ర పేరు విరూపాక్ష అని, అయితే అందరూ వీర అని పిలుస్తారని చెప్తున్నారు. ఈ  పాత్ర రాబిన్ హుడ్ ని పోలి ఉంటుందని చెప్తున్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారని సమాచారం. 

ఇక ఈ పీరియాడిక్ మూవీలో జాక్వీలిన్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలావుంచితే, మరోపక్క పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం బ్యాలెన్స్ చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కావచ్చని సమాచారం. హరీష్ శంకర్ తో చేస్తున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.