రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న చిత్రం 'క్రాక్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నాడు.  సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయబోతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌కటించారు. ప్రమోషన్స్ భాగంగా ట్రైలర్ ని సైతం రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ తెచ్చుకుంది. సినిమాలో వయోలెన్స్ ఎక్కువగానే ఉండటంతో ఏ కూడా ఇచ్చారు. అలాగే జనవరి 9న ఈ సినిమా విడుదల కానుందని అఫీషియల్ గా ప్రకటించారు. ముందు జనవరి 14న విడుదల చేయాలనుకున్నా కూడా రెడ్ సినిమాతో పోటీ ఎందుకుని ముందుకొచ్చేసాడు రవితేజ. ఈ మేరకు హీరో రామ్, రవితేజ  ఫోన్ లో మాట్లాడుకున్నారని తెలుస్తోంది.   

ట్రైలర్ లోని...‘శంకర్‌ పోతరాజు వీర శంకర్‌.. షూర్‌ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చే పేలిపోద్ది’ అంటూ రవితేజ చెప్పిన మాస్‌ డైలాగులు జనాల్లోకి బాగా వెళ్లేటట్లు ఉన్నాయి. అలాగే ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్‌.. ఇక్కడ కామన్‌ పాయింట్‌ ఏమిటంటే.. ఈ ముగ్గురుతో ఆడుకుంది ఒకే పోలీసోడూ’ అంటూ ట్రైలర్‌ ప్రారంభంలో హీరో వెంకటేశ్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది.

ఇందులో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు.  రాజా ది గ్రేట్ చిత్రం త‌ర్వాత  స‌రైన హిట్ సాధించని ర‌వితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.