`ఆచార్య` చిత్రంలో రామ్‌చరణ్‌ నటించిన `సిద్ధ` పాత్ర కోసం మొదట మహేష్‌బాబుని అనుకున్నారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. 

చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఆచార్య`.. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతుంది. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడిగా పూజా హెగ్డే కనిపించబోతుంది. ఈ చిత్రం శుక్రవారం(ఏప్రిల్‌ 29)న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్‌ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇందులో రామ్‌చరణ్‌ పాత్రకి ముందు మహేష్‌ని తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే ప్రశ్న దర్శకుడు కొరటాల శివకి ఎదురైంది. 

దీనిపై ఆయన స్పందిస్తూ.. తాము మహేష్‌బాబు ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. మహేష్‌ మా థాట్‌లో లేరని తెలిపారు. పాత్ర అనుకున్నప్పుడు చరణే గుర్తొచ్చినట్టు చెప్పారు. అయితే మహేష్‌బాబు చేయబోతున్నారనేది కేవలం మీడియా సృష్టే అంటూ, మీరు రాసినదానికి, నేను ఎలా సమాధానం చెబుతానంటూ సెటైర్లు పేల్చారు దర్శకుడు.అయితే ఈ చిత్రానికి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం పట్ల మహేష్‌కి ధన్యవాదాలు తెలిపారు కొరటాల. ఆయన వాయిస్‌ సినిమాకి ప్లస్‌ అవుతుందని, ప్రారంభంలో అసలు కథ చెప్పి, ఆడియెన్స్ ని ఆ కథలోకి తీసుకెళ్తారని తెలిపారు. 

ఇదిలా ఉంటే `ఆచార్య`లో రామ్‌చరణ్‌ పాత్ర తనకు బాగా దగ్గరగా అనిపించిందని, సోల్‌ కలిసిన ఫీలింగ్‌లో ఓ సన్నివేశంలో గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లొచ్చాయని చెప్పారు చిరంజీవి. అయితే రామ్‌చరణ్‌ సిద్ద పాత్ర చేయకపోతే ఆ పాత్రకి పవన్‌ కళ్యాణ్‌ బెస్ట్ ఆప్షన్‌ అని, ఆయనతో సినిమా చేసేవాళ్లమని తెలిపారు చిరు. సినిమా చూశాక ఎమోషనల్‌గా సిద్ధ పాత్రతో బాగా కనెక్ట్ అవుతారని పేర్కొన్నారు. చరణ్‌కి మంచి పేరొస్తుందన్నారు. 

ఇందులో సిద్ధ పాత్రలో రామ్‌చరణ్‌ నటించిన విషయం తెలిసిందే. ఆయనది ద్వితీయార్థంలో వస్తుందట. 40 నిమిషాలపాటు ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం కేవలం నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌ మాత్రమే అని, అలాగే టెంపుల్‌ అనేది కూడా బ్యాక్‌డ్రాప్‌లు మాత్రమే అని, అసలు కథ వేరని తెలిపారు. ఇద్దరు భిన్న ధృవాలైన వ్యక్తులు ధర్మం కోసం కలిసి పోరాటం చేయడమనేది కథ అని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఓ సెల్యూషన్‌ ఇవ్వబోతున్నట్టు దర్శకుడు పేర్కొన్నారు. కథ పూర్తిగా ఫిక్షన్‌ అని, రియల్‌లైఫ్‌కి సంబంధం లేదన్నారు. అదే సమయంలో దేవాలయాల నేపథ్యంలో సాగే కథ కూడా కాదని చెప్పారు.