ప్రధాని దగ్గర నుంచి పేదవాడి దగ్గర వరకు కరోనాను ఎలా కట్టడి చేయాలి అనే విషయంపై మాట్లాడుతుంటే...కొందరు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడుతూ,సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఫలానా వారికి కరోనా సోకింది, ఫలానాది తింటే కరోనా రాదు ఇలా తమకు తోచిన పోస్ట్ లు పెడుతూ జనాలను తప్పు దారి పట్టిస్తున్నారు. అయితే ప్రభుత్వం వీటిని చూసి చూడనట్లు వదిలేయటం లేదు. అలా చేసేవారిని కటకటాల వెనక్కి తోస్తోంది. తాజాగా సమాజంలో భాధ్యతగా వహించాల్సిన ఓ గాయని సైతం ఇలాంటి చెత్త పనేచేసింది.

వివరాల్లోకి వెళితే...కోల్ కతాలోని ఓ వైద్యునికి కరోనా వైరస్ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేసిన అక్కడి ప్రముఖ సింగర్ ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతాలోని బెలిఘటలోని ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా వైరస్ సోకిందంటూ పశ్చిమబెంగాల్ లో ప్రముఖ సింగర్, థియేటర్ గ్రూప్ నటిగా గుర్తింపు ఉన్న 29 ఏళ్ల మహిళ తప్పుడు పోస్టింగ్ సోషల్ మీడియాలో ఉంచింది.

 అయితే ఆ ఆసుపత్రి వైద్యులకుగాని, సిబ్బందికి గాని ఎవరికీ కరోనా సోకలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ ఈలోగానే ఆమె పెట్టిన పోస్టింగ్ వైరల్ కావడంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి సదరు మహిళను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో కరోనాపై వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దని, రూమర్స్ వ్యాప్తి చేయొద్దంటూ ప్రభుత్వం తరపున ఓ పాటపాడిన ఈ సింగరే ఇలా తప్పుడు ప్రచారానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.