తెలుగులో కిక్‌, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్‌ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్యాం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన శ్యాంను చెన్నై లోని కోడంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో కొంత కాలంగా ఫోకర్‌ పేరుతో క్లబ్‌ను నిర్వహిస్తున్న శ్యాం, ఆ క్లబ్‌ ముసుగులో గ్యాంబ్లింగ్‌కు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు రావటంతో శ్యాంను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అనుమతులు లేకుండా ఫోకర్ క్లబ్‌లో పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టుగా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి శ్యాంను కోడంబాకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈకేసుకు సంబంధించిన విచారణ జరుగుతుందని త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.