కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ రివ్యూ
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. ఈమె టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓరియెంటెడ్ మూవీగా హై బడ్జెట్‌తో రూపొందిన ‘మిస్ ఇండియా’ నటిగా కీర్తి సురేష్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ ఈ రోజు( నవంబర్ 4న) ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. ఈ నేపధ్యంలో అసలు ఈ ‘మిస్ ఇండియా’ కథేంటి...చూడదగ్గ సినిమాయోనా,కీర్తి సురేష్ నటన .. ‘మహానటి’ స్దాయిలో ఉందా చూద్దాం.
కథేంటి
మానసా సంయుక్త (కీర్తి సురేష్)కు చిన్నప్పటి నుంచీ బిజినెస్ చేయాలనే ఆలోచన. అయితే బిజినెస్ అనేది మగాళ్ల మాత్రమే చేయగలరని,ఆడపిల్ల అంటే ఆ..డ పిల్లే అని,అత్తారింటికి వెళ్లేదని పాతకాలం ఆలోచనలు రుద్దుతూంటారు అందరు. అయితే ఆమె తాత విశ్వనాధ శాస్త్రి (రాజేంద్రప్రసాద్)కు మాత్రం ఆమె కలలపై నమ్మకం. దాంతో ఆమెను ఎంకరేజ్ చేస్తూంటాడు. ఆయనో ఆయుర్వేద వైద్యుడు. తన వైద్యంలో భాగంగా జనాలకి హైర్బల్ టీ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తూంటాడు. అది దగ్గరనుంచి చూసిన ఆమెకు ఆ టీ అంటే మహా ఇష్టం..నమ్మకం. అదే ఆమెకు అమెరికా వెళ్లి చదవుపూర్తి చేసాక చాయ్ బిజినెస్ చేయటానికి స్పూర్తినిస్తుంది. అయితే ప్రతీ చోటా ఉన్నట్లే ఇక్కడా ఆమెకు పోటీలాంటి అవరోధాలు ఎదురౌతాయి.
విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి దేశంలో మన దేశం నుండి వెళ్లిన ఓ అమ్మాయి టీ బిజినెస్‌ను స్టార్ట్ చేయటమే అంటే సాహసమే.టీ బిజినెస్ రంగంలో రాణించాలని ప్రయత్నించే ఈ మధ్య తరగతి అమ్మాయి కన్న కలలకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి.అక్కడ అమెరికాలో కాఫీ బిజినెస్ పెట్టి రూల్ చేస్తోన్న కైలాష్ (జగపతిబాబు) లాంటి ప్రత్యర్థి ఎదురౌతాడు. అతన్ని తట్టుకుని ,తన సమస్యలను ఎలా అధిగమించి సక్సెస్ అయ్యిందనేదే ‘మిస్ ఇండియా’ సినిమా. ఓ అమ్మాయి ఛాలెంజింగ్ జర్నీనే ఈ సినిమా.
ఎలా ఉంది
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించటానికి సాధారణంగా స్టార్ హీరోయిన్స్ కెరీర్ లో పీక్స్ లో ఉండగా ఒప్పుకోరు. ఎందుకంటే క్లిక్ అయితే స్టార్ హీరోలు తమ ప్రక్కన చేయటానికి చోటు ఇవ్వరని భయం. దానికి తోడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అంటే అంతా తామే మోయాలి. అందుకే కాస్త సెటిలయ్యి..తమ ఇమేజ్ తో సినిమా ఆడుతుందని నమ్మకం వచ్చేదాకా అలాంటి సినిమాలు జోలికి పోరు. రెగ్యులర్ మసాలా,కమర్షియల్ సినిమాల్లో హీరోల ప్రక్కన నటించటానికే ఆసక్తి చూపుతారు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తే వచ్చే గుర్తింపు, ప్రజాదరణ వారిని అటువైపు మ్రొగ్గేలా చేస్తాయి. అయితే కీర్తి సురేష్ కెరీర్ మొదట్లోనే అటువంటి సినిమాలకు సై అంటోంది. ఇంతకు ముందు కూడా కీర్తి సురేష్ చేసిన హీరోయిన్ ఓరియెంటెండ్ 'పెంగ్విన్' ఓటీటిలో రిలీజైంది. ఇప్పుడు కూడా ‘మిస్ ఇండియా’ ఓటీటి (నెట్‌ఫ్లిక్స్) లో వచ్చేసింది.
`జాతీయ ఉత్తమ నటి… కీర్తి సురేష్` నటించిన సినిమా అంటే ఖచ్చితంగా ఆమె ఎంపికలో ఎంతో కొంత వైవిధ్యం ఉంటుందనే భావిస్తాం. ప్రతీ సినిమా ‘మహా నటి’ స్ధాయిలో లేకపోయినా మూమాలు నటిగా అయినా ఆవిష్కరింపబడుతుందని అనుకుంటాం. అయితే ఇక్కడే మనం బోల్తాం పడతాం. సినిమాలో అంత సీన్ లేదని మొదట పది నిముషాల్లోనే హింట్ ఇచ్చేస్తాడు డైరక్టర్. ఇది ఓ టీ అమ్ముకునే అమ్మాయి కథ అని ట్యాగ్ లైన్ పెట్టకపోయినా ప్రతీ ఐదు నిముషాలకు ఆ టాపిక్ తెస్తూండటంతో తర్వాత సీన్స్ లో సరిగ్గా జరిగేది ఇదే అని డిసైడ్ అయ్యిపోతాం. అయితే ఎక్కడో చిన్న ఆశ. మెల్లగా కథలోకి తీసుకెల్లి ఆ తర్వాత మన ఎమోషన్స్ ని పీక్స్ కు తీసుకెల్తాడేమో అని ఎదురుచూస్తాం. కానీ డైరక్టర్ నిజాయితీపరుడు. మొదట్లో ఏ హింట్ అయితే ఇచ్చాడో అటే తన ప్రయాణం పెట్టుకుంటాడు. మనని ఛీట్ చేయడు. సినిమా ..మొదట్లో మీరు ఎంత బోర్ ఫీలవుతూ చూస్తారో ..అదే చివరి దాకా సస్టైన్ చేస్తాడు. ఎక్కడా గ్రాఫ్ తప్పడు. జగపతిబాబు లాంటి విలన్ ని పెట్టుకున్నారు. ఆయన్ని ఓ సింహంలా.. పెద్ద బిజినెస్ టైకూన్ గా ఓ నెగిటివ్ క్యారక్టర్ గా చూపించారు. అంతవరకూ బాగుంది.
అయితే ఆయన్ని ఢీ కొట్టే చిట్టెలక గా మాత్రం కీర్తి సురేష్ ఏ స్దాయిలోనూ అలరించదు. ఎత్తులు,పై ఎత్తులూ ఉండవు. ఛాలెంజ్ ఉంటుంది కానీ ఆ సీన్స్ చూస్తూంటే ఇక చాల్లే అనిపిస్తుంది. స్పీల్ బర్గ్ ఓ చోట ఇంటర్వూలో చెప్తారు...ఏ సినిమాకు అయినా బిలీవబులిటీ అనేది ముఖ్యం. రాక్షస బల్లులు మళ్లీ భూమి మీదకు వచ్చాయంటే..ఆ వచ్చిన విధానం నమ్మశక్యంగా ఉండాలి. లేకపోతే జనం లేచిళ్లిపోతారు అని. అలాగే అమెరికా వెళ్లి టీ అమ్మకాలు ప్రారంభించి, నెంబర్ వన్ స్దాయికి ఎదిగిన అమ్మాయి కథలో ఎక్కడో చోట ..అవును ఇలా జరిగే అవకాసం ఉందనిపించాలి. జంధ్యాల గారి పాత సినిమా చిన్ని కృష్ణుడులో అనుకుంటా..అమెరికాలో కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో చిన్న బిజినెస్ మొదలెడుతుంది హీరోయిన్..దాన్ని ఫన్ తో డీల్ చేసినా ఆ క్షణానికి అది నిజమే అనిపిస్తుంది. ఆ మాత్రం కూడా ఇక్కడ మనకు నమ్మశక్యం కాని సీన్స్ తో మెప్పించే ప్రయత్నం చేస్తాడు. అందుకు కారణం కథలో సరైన కాంప్లిక్స్ లేకపోవటమే. జగపతిబాబు వైపు నుంచి కూడా కథకు అవసరమైన దినుసులు అందకపోవటమే. ఏదైమా మంచి ప్రయత్నం...స్క్రిప్టు సమస్యలతో బోర్ గా..సినిమావాళ్ల భాషలో భారీ ల్యాగ్ గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్ సినిమాచూస్తూంటే రజనీకాంత్ శివాజీ సినిమాలాగ సీన్స్ ఉండటంతో ..బాగా సినిమాటెక్ గా అనిపిస్తుంది. కాస్తంత సహజంగా ఉంటే ఫస్టాఫ్ లో వచ్చే సీన్స్ ...కు సింక్ అయ్యేది.
నటీనటులు..
‘మిస్ ఇండియా’లో తన పాత్ర కోసం కీర్తి సురేష్ స్లిమ్ అయ్యి కొన్ని సీన్స్ లో కొత్తగా కనపడుతుంది. అలాగేఈ సినిమాలో కీర్తికి తల్లిగా నదియా, తండ్రిగా సీనియర్ నరేష్, అన్నగా కమల్ కామరాజు నటించారు. కీర్తి తాతగా రాజేంద్ర ప్రసాద్ ఎప్పటిలాగే మెప్పించారు. స్టైలిష్ బిజినెస్‌మెన్ గా జగపతిబాబు బాగున్నారు. అలాగని ఎవరూ అద్బుతమైన నటన విన్యాసం చేయలేదు. తాము అన్ని సినిమాల్లో చేసినట్లే చేసుకుంటూపోయారు.
టెక్నికల్ గా..
డైరక్టర్ ఈ సినిమాలో మంచి విజువల్స్ ని ప్రెజెంట్ చేయటానికే ప్రయత్నించారు. కెమెరా వర్క్ కూడా బాగుంది. తమన్ సంగీతం సోసోగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు ఏ మాత్రం ప్లస్ కాలేదు. మొత్తం మాస్ సినిమాకు ఇచ్చినట్లు ఇచ్చుకుంటూ పోయాడు. అక్కడున్నది కీర్తి సురేష్ అని మర్చిపోయి..ఏ రవితేజానో ,పవన్ కళ్యాణ్ అనుకున్నట్లున్నారు. ఇక ఎడిటింగ్ మాత్రం చాలా ల్యాగ్ లు ఉన్నాయి. ఎందుకు వదిలేసారో మరి. నిర్మాణ విలువలు సినిమాకు రిచ్ లుక్ తెచ్చాయి.
ఫైనల్ థాట్
హీరోయిన్ తన టీ బిజినెస్ పెరగటానికి ఈ ‘మిస్ ఇండియా’ సినిమా ఫ్రీగా చూపించటం అనే ప్రమోషన్ ప్లాన్ చేయచ్చు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
ఎవరెవరు..
సంస్థ: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
నటీనటులు: కీర్తి సురేశ్, జగపతిబాబు, సుమంత్ శైలేంద్ర, నవీన్‌చంద్ర, నదియ, నరేశ్, కమల్ కామరాజు, రాజేంద్రప్రసాద్, పూజిత పొన్నాడ, దివ్య శ్రీపాద తదితరులు
కళ: సాహి సురేష్
పాటలు: కళ్యాణ్ చక్రవర్తి, నీరజ కోన
రచన: నరేంద్రనాథ్, తరుణ్ కుమార్
కూర్పు: తమ్మిరాజు
ఛాయగ్రహణం: సుజిత్ వాసుదేవ్
సంగీతం: తమన్
నిర్మాత: మహేష్ కోనేరు
దర్శకుడు: నరేంద్ర నాథ్
విడుదల: 04 నవంబర్ 2020 (‘నెట్‌ఫ్లిక్స్’లో)