పవన్ ఫ్యాన్స్‌ కు, మహేష్ కత్తికి వివాదం సద్దుమణిగినట్లేనా.. నాలుగు నెలల పాటు డిబేట్ల మీద డిబేట్లతో సుదీర్ఘంగా కొనసాగిన వివాదానికి ఇక పుల్ స్టాప్ పడ్డట్లేనా.. అంటే అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తే. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరడంతో సంతోషంగా సెల్ఫీలు దిగి మరీ వివాదానికి శుభం కార్డ్ వేశారు. ఈ సయోధ్య ఎంతకాలమో గాని, ప్రస్థుతానికైతే అంతా మంచే జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రచయిత కోన వెంకట్ కూడా మహేష్ కత్తికి థ్యాంక్స్ చెప్పడం విశేషం.

 

“ఈ వివాదానికి ఒక పరిష్కారాన్ని చూపించిన  మహానుభావులకు నా ధన్యవాదాలు. పవన్ కల్యాణ్ అభిమానులకు ఇదో బిగ్ రిలీఫ్. ఈ రాద్దాంతానికి సద్దమణిగించడానికి రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ శ్రేయోభిలాషులు విష్ణు, రాంకీ, కల్యాణ్, దిలీప్ సుంకర, నాగిరెడ్డి, కోటిలకు బిగ్ థ్యాంక్స్. సమస్య శాశ్వత పరిష్కారానికి ముందుకొచ్చిన కత్తి మహేష్‌కు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇకపై ఫాల్స్ కామెంట్స్‌ తో, వీడియోలతో ఎవరూ కత్తి జోలికి వెళ్లవద్దు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే.. వాళ్లంతా పవన్ కల్యాణ్‌కు శత్రువుల కిందే లెక్క” అంటూ కోన ట్వీట్ చేశారు.

 

అంతే కాక మరో ట్వీట్ లో “పోరాటం అప్పుడే అయిపోలేదు మిత్రులారా. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పవన్ కల్యాణ్ చాలా కష్టాల్ని ఎదుర్కొంటున్నారు. మీరు నిజంగా పవన్ శ్రేయోభిలాషి అయితే, ఇకనైనా శాంతంగా, సంయమనంగా ఉండండి. మీరు పవన్ కల్యాణ్ భావజాలనికి ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా సమాజ విశ్వాసాన్ని చూరగొనండి” అని పేర్కొన్నారు కోన.  

 

 

పవన్ ఫ్యాన్స్-మహేష్ కత్తి వివాదంలో వ్యక్తిగత విషయాలు కూడా తెర పైకి రావడం, మహేష్ కత్తి వ్యక్తిగత విషయాలను పవన్ ఫ్యాన్స్ బయటకు లాగడంతో.. తాను కూడా పవన్ విషయాలను బయటపెడుతానంటూ కత్తి హెచ్చరించారు. వ్యవహారం మరింత ముదురితే ఇరు వర్గాలకు నష్టం జరుగుతుందని భావించే ఇరు వర్గాలు సంయమనం పాటించడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా పవన్ ఫ్యాన్స్ పై కత్తి మహేష్ పోలీస్ కేసు ఉపసంహరించుకోవటంతో.. ఫిలిం నగర్ లోని ఓ రెస్టారెంట్ వేదికగా పవన్ ఫ్యాన్స్, కత్తికి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. పెద్ద మనసుతో కత్తి కేసును ఉపసంహరించుకోవడం పట్ల పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు, వివాదం సద్దుమణిగిన సందర్భంగా ఇరు వర్గాలు మాంచి పార్టీ చేసుకున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. మరి ఈ వివాదం మముగిసినట్లేనా లేదా అనేది నాలుగు రోజులు పోతే తెలుస్తుంది.