డబ్బింగ్ సినిమా అంటే ఒకప్పుడు వేరే భాషలో సూపర్ హిట్ అయ్యినవే వచ్చేవి. దాంతో డబ్బింగ్ సినిమా అనగానే కాస్తంత విభిన్న కథా సినిమా ఉంటుందని భావించేవాళ్లం. అవి ఇక్కడ కూడా బాగా ఆడి, ఆ హీరోలకు ఇక్కడా మార్కెట్ తెచ్చేవి. ఆ తర్వాత ప్రతీ పెద్ద హీరో కూడా తెలుగు మార్కెట్ లో సెటిల్ అవ్వటానికి ప్రవేశించటానికి డబ్బింగ్ ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. తమ సినిమాను తెలుగు,తమిళం ఇలా  ఒకేసారి  సైమన్టైనిస్ గా ఒకేసారి రిలీజ్ లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని మాత్రమే వర్కవుట్ అవుతున్నాయి.  అదే క్రమంలో  కార్తీ సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. రీసెంట్ గా 'ఖైదీ' తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన  కార్తీ ఉత్సాహంగా ఓ యాక్షన్ సబ్జెక్ట్ ని తీసుకుని ఎంటర్ట్మైంట్ వేలో డీల్ చేస్తూ 'సుల్తాన్‌'గా మన ముందుకు వచ్చాడు.టీజర్, ట్రైలర్స్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచిన ఈ సినిమా తెలుగులోనూ భారీగానే విడుదలైంది. ఈ సినిమా కథేంటి...కార్తీ కు ఈ సినిమా హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి..

డాన్ సేతుపతి(నెపోలియన్‌) కొడుకు... సుల్తాన్(కార్తీ) . తన భార్యకు ఇచ్చిన మాటతో ..కొడుకుని తనలాగ డాన్ కాకుండా ఉండటం కోసం దూరంగా పెంచుతూంటాడు. అలా పెరిగి  పెద్దై ముంబైలో  రోబోటిక్ ఇంజనీర్ గా సెటిల్ అవుతాడు. ఓ సారి ఇంటికి వస్తాడు. తనను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని, పెంచిన తన తండ్రి అనుచరులు వందమంది రౌడిలతో సరదాగా గడుపుతాడు. ఇక తిరిగి వెళ్దామనుకునేలోగా... తన తండ్రిపై ఎటాక్ జరిగి, చనిపోతాడు. ఈ క్రమంలో తన తండ్రి అనుచురులైన వందమంది రౌడీల భాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో అతనికో విషయం తెలుస్తుంది. పోలీస్ కమీషనర్ ..తమ తండ్రి గ్యాంగ్ పై దృష్టి పెట్టారని, అందులో భాగంగానే తండ్రిని లేపేసారని అర్దమవుతుంది. దాంతో షాక్ అయ్యిన సుల్తాన్ ఇప్పుడు తన వాళ్లను రక్షించుకోవాలనుకుంటాడు. అందుకోసం కమీషనర్ ని కలుస్తాడు. ఓ ఆరు నెలలు టైమ్ ఇవ్వమని, వాళ్లు మారతారని, ఒక్క చిన్న క్రైమ్ కూడా వాళ్లను చేయనివ్వనని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో వాళ్లను క్రైమ్ వైపు వెళ్ళకుండా చూసుకునే పనిలో పడతాడు. అదే సమయంలో తన తండ్రి చనిపోయే ముందు ఒకరికి మాట ఇచ్చారని తెలుస్తోంది. అదేమిటంటే...అమరావతిలోని వెలగపూడి గ్రామంలో కొంతమంది రౌడీలు వ్యవసాయం చేయకుండా అడ్డు పడుతున్నారని,వాళ్ల నుంచి తమను కాపాడమని అడుగుతారు. ఆయన వాళ్లకు మాట ఇస్తాడు. కానీ మాట నిలబెట్టుకునేలోగా చనిపోతాడు. దాంతో ఇప్పుడు ఆ ఊరికి బయిలుదేరతారు...ఈ వందమంది, సుల్తాన్ తో కలిసి. అక్కడే రుక్మిణి(రష్మికా మందన్నా) పరిచయం అవుతుంది. అక్కడ నుంచి కథ మలుపుతిరుతుంది. ఇంతకీ ఆ గ్రామంలో ఎందుకు వ్యవసాయం చేయకుండా రౌడీలు అడ్డుపడుతున్నారు. వాళ్ల మీద సుల్తాన్ ...ఎటాక్ తన వాళ్ల చేత చేయించి, రక్షిస్తాడా....చేయిస్తే కమీషనర్ ఊరుకుంటాడా..చివరకు ఏమైంది. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
ఎనాలసిస్ ...

ఈ సినిమా చూస్తూంటే చాలా తెలుగు సినిమాలు గుర్తు వస్తాయి..అలాగే అకిరా కురసోవా సెవెన్ సమురాయి సినిమా కూడా గుర్తు వస్తుంది. అయితే ఎన్ని కలిపినా అవి సరిగ్గా సెట్ కాలేదు అనిపిస్తుంది. కార్తీ ..యాక్షన్ సినిమా చెయ్యాలనుకున్నాడు అందుకు తగ్గ సీన్స్ అల్లారు అనిపిస్తుంది. అలాగే వందమంది రౌడీలు కాన్సెప్ట్ వినటానికి చాలా బిల్డప్ గా అనిపిస్తుంది. కానీ తెరమీదకు వచ్చేసరికి వారితో పెద్దగా సీన్స్ పండించలేకపోయారు. కార్తీ..ఆ రౌడీలతో చేసే కామెడీకు నవ్వురాదు. అలాగే చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం సాగుతుంది. ట్విస్ట్ లు అనుకున్నవి అన్నీ మనం ముందే గెస్ చేసేస్తాం. మాస్ ఎంటర్టైనర్ గా మలిచే క్రమంలో దర్శకుడు మాస్ ఎలిమెంట్స్ చాలా సినిమాల నుంచి తీసుకువచ్చి కలపటంతో అది కలగాపులగంగా తయారైంది. కార్తి స్టైల్ ఫన్ పండితే బాగుండేది. కానీ యాక్షన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటంతో అది మిస్సైంది. అలాగే రష్మిక, కార్తి మధ్య వచ్చే రొమాన్స్ కూడా ఏమీ కొత్తగా లేదు. విలన్స్ ట్రాక్ చూస్తూంటే విక్రమార్కుడు, కేజీఎఫ్ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్ ఒక విలన్, సెకండాఫ్ ఒక విలన్. ఇద్దరికి పెద్ద లింక్ ఉండదు.  పేరుకు వాళ్లు విలన్సే కానీ వారికి కథలో పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవటంతో...హీరో క్యారక్టర్ ప్యాసివ్ గా మారింది. హీరో ని ఏదైనా చేద్దామనే ఆలోచన వచ్చి,జనాలను పోగేసుకునేసరికి క్లైమాక్స్ వచ్చేసింది.  దాంతో బారీగా యాక్షన్ సీన్స్ ఉన్నా..కిక్ ఇవ్వలేకపోయాయి. అరుపులు..కేకలే తెరపై మిగిలాయి.  'కేజీఎఫ్‌' ఫేమ్‌ రామ్‌ లాంటి స్టార్‌ విలన్‌ కూడా ఉపయోగపడలేదు.దానికి తోడు రౌడీలతో పల్లెలో వ్యవసాయం చేయించటం కూడా ఉంది. అవీ పండలేదు. యాక్షన్ సీన్స్ లో రాజమౌళి వంటి డైరక్టర్స్ ని ఫాలో అయిన దర్శకుడు...వాళ్లు విలన్స్ కు ఇచ్చే ప్రయారిటీ అనేది కూడా గుర్తిస్తే బాగుండేది. వీటికి తోడు తమిళ అతి విపరీతం. 


దర్శకత్వం,మిగతా విభాగాలు..

కార్తిని మాస్ ఎంటర్టైనర్ లో చూపించాలన్న దర్శకుడు ఆలోచన బాగున్నా..... తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు బక్కియరాజ్‌ కణ్ణన్ సక్సెస్ కాలేదు. స్క్రిప్టు ఆయనకు సహకరించలేదు. డైలాగులు అందుకు తగ్గట్లే ఉన్నాయి. ఇక రన్ టైమ్ అయితే చాలా తగ్గించాలి.  కార్తీ విషయానికి వస్తే క్యారక్టరైజేషన్ లేని పాత్ర. దాంతో సీన్ ని బట్టి సుల్తాన్ గా చేసుకుంటూపోయాడు. కార్తీ ఫైట్స్ చేస్తూంటే ...ఆ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. ఇక పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందాన్న బాగుంది.  హీరో తండ్రి పాత్రలో నెపోలియ‌న్ , విలన్ పాత్రలో 'కేజీఎఫ్‌' ఫేమ్ రామ్ నటన బాగుంది. అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా బాగానే చేసారు.  డబ్బు బాగానే ఖర్చుపెట్టించాడు డైరక్టర్. అలాగే వివేక్ – మెర్విన్‌ల సాంగ్స్, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫి కూడా పెద్ద హీరో సినిమాకు తగ్గట్లే ఉంది.  

ఫైనల్ థాట్
మా తెలుగు హీరోలు,డైరక్టర్స్ ఆల్రెడీ ఇలాంటి సినిమాలే చేస్తున్నారు కదా..మళ్లీ మీరు కూడా అవే చూసి,వండి వడ్డించేస్తే ఎలా 

Ratign:2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల


ఎవరెవరు....
నటీనటులు : కార్తీ, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియ‌న్‌, లాల్, రామ‌చంద్రరాజు తదితరులు
నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్
సంగీతం :  వివేక్‌- మెర్విన్
ఎడిటర్‌: రూబెన్
సినిమాటోగ్రఫీ : స‌త్యన్‌ సూర్య‌న్
నిర్మాతలు : య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు
దర్శకత్వం : బక్కియరాజ్‌ కణ్ణన్
విడుదల తేది : ఏప్రిల్‌ 02,2021